నర్సీపట్నం : కార్తీక మాసం పురస్కరించుకుని పంచారామ పుణ్యక్షేత్రాలకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పాలుమూరి ఆచారి తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒకే రోజులో దర్శించుకోవడానికి డిపో నుండి ఆల్ట్రాడీలక్స్ ప్రత్యేక బస్సు నడుపుతున్నామన్నారు. డిపోలో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామని, అల్ట్రాడీలక్స్కు రాను, పోను టిక్కెట్ ఛార్జీ రూ.1470 నిర్ణయించామని తెలిపారు. పంచారామాలకు వెళ్లే భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని విజ్ఞాన యాత్రలకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు అనగా లంబసింగి, తాజంగి జలాశయం, కొత్తపల్లి జలపాతం, పాడేరు మోదకొండమ్మ తల్లి, అరకు, బొర్రా గుహలు, విశాఖపట్నం ఆర్.కె.బీచ్, కై లాసగిరి, జూపార్క్, రుషికొండ, వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయనగరం రామనారాయణం, అరసవిల్లి, శ్రీకూర్మం, సింహాచలం, బొజ్జన్నకొండ, కొండకర్ల ఆవ, ఉపమాపక వేంకటేశ్వరస్వామి, అన్నవరం, వాడపల్లి మొదలగు వాటిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామని డిపో మేనేజర్ తెలిపారు. శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.


