తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–పాట్నా–విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖ–పాట్నా(08588) ట్రైన్ ఆన్ డిమాండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15, 22 తేదీల్లో(ఆదివారాలు) రాత్రి 7.25 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు సోమవారం రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పాట్నా–విశాఖ(08587) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16, 23 తేదీల్లో(సోమవారాలు) రాత్రి 9.50 గంటలకు పాట్నాలో బయలుదేరి మరుసటి రోజు మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆయా తేదీల్లో పలు రైళ్లకు అదనపు థర్డ్ ఏసీ కోచ్‌లను జత చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. భువనేశ్వర్–యశ్వంత్‌పూర్(02811) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 14, 21 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్–భువనేశ్వర్(02812) రైలుకు ఈ నెల 16, 23 తేదీల్లో ఒక్కో థర్డ్ ఏసీ కోచ్ జత చేయనున్నారు. పూరి–యశ్వంత్‌పూర్ (22883) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 20న, తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్–పూరి (22884) రైలుకు ఈ నెల 21న ఒక్కో థర్డ్ ఏసీ కోచ్ అదనంగా జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


