సమావేశంలో మాట్లాడుతున్న ఉపవిద్యాశాఖాధికారి హుస్సేన్
అనకాపల్లి టౌన్ : చదువుకు దూరమైన వారు, వివిధ కారణాలతో పాఠశాలకు వెళ్లలేని వారికి పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే అవకాశాన్ని ఏపీ ఓపెన్ స్కూల్ కల్పిస్తుందని జిల్లా ఉపవిద్యాశాఖాధికారి హుస్సేన్ తెలిపారు. స్థానిక భీమునిగుమ్మం జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులకు జరిగిన ఒక రోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై ప్రతి మండల విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయ అధికారి టి.వి.రమణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు, గృహిణులు, మధ్యతరగతి కుటుంబ సభ్యులకు ఓపెన్ స్కూల్ విద్య చక్కటి అవకాశమన్నారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ. 200 అపరాధ రుసుంతో నవంబర్ 30వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు.


