వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న సిబ్బంది కొరత, అస్తవ్యస్త సర్దుబాట్లు
నిపుణులు చేయాల్సిన పనులను అర్హత లేనివారితో చేయిస్తున్న వైనం
విమ్స్, ఆర్‌సీడీ, మెంటల్ కేర్, ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు
ఈఎన్టీ ఆసుపత్రిలో అభా యాప్ నమోదులో నర్సులు
బీచ్‌రోడ్డు: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత కారణంగా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకుండా, సంబంధం లేని సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తుండటంతో వైద్య వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేయాలనే అధికారుల ధోరణి రోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా నగరంలోని విమ్స్, ఆర్‌సీడీ, మెంటల్ కేర్, ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న వైద్యం, వైద్య పరీక్షలపై రోగుల్లో అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
ఆర్‌సీడీలో ఆర్థో వైద్యులే దిక్కు
పెదవాల్తేరులోని ఆర్‌సీడీ ఆసుపత్రి రెండేళ్లుగా చిన్న పిల్లల వైద్యులు(పీడియాట్రిషియన్స్) లేరు. అంగవైకల్యం ఉన్న చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేసిన అనంతరం పీడియాట్రిషియన్స్ పర్యవేక్షణ తప్పనిసరి. గతంలో ఏఎంసీ నుంచి పిల్లల వైద్య నిపుణులు వచ్చేవారు. ఏడాదిగా వారు కూడా రావట్లేదు. దీంతో పిల్లల వైద్య నిపుణులు లేకుండానే ఆర్థోపెడిక్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే మందుల మోతాదులో ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
నర్సులే ఈఈజీ టెక్నీషియన్లు
ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం(మెంటల్ కేర్)లో మానసిక రోగులకు చేసే ఈఈజీ, ఎన్సీవీ వంటి నరాల పరీక్షలు అత్యంత కీలకమైనవి. శిక్షణ పొందిన ఈఈజీ టెక్నీషియన్లు మాత్రమే చేయాల్సిన ఈ పరీక్షలను, ఇక్కడ స్టాఫ్ నర్సులతో నిర్వహిస్తున్నారు. నివేదికల్లో తేడాలు వస్తే రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని వైద్య వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఎవరికీ పట్టని పరిస్థితి.
ఫిజియోథెరపీలో ప్రయోగాలు
ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి పరిస్థితి మరోరకం. ఇక్కడ టీబీ, ఆస్తమా, శ్వాసకోశ రోగులకు అత్యంత కీలకమైన ఫిజియోథెరపీ సేవలను అర్హత కలిగిన నిపుణులు కాకుండా.. ఫిజియోథెరపీ విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు. నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్యను గుర్తించే స్లీప్ స్టడీ పరీక్షలను రెస్పిరేటరీ లేదా స్లీప్ టెక్నీషియన్లు చేయాల్సి ఉండగా.. టెక్నీషియన్లు లేరనే సాకుతో జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా.. తప్పుడు రోగ నిర్ధారణతో రోగి ప్రాణాలకే ముప్పని తెలిసినా.. పట్టించుకోని పరిస్థితి.
ఉన్నతాధికారుల మౌనం.. రోగుల్లో భయం
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపకుండా, తాత్కాలిక సర్దుబాట్లతో కాలం వెళ్లదీయడం వెనుక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎవరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారోనని రోగుల బంధువుల భయపడుతున్నారు. ఇప్పటికై నా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని.. అర్హులైన నిపుణుల ద్వారానే మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగుల బంధువులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కింది స్థాయి ఉద్యోగులే ఫార్మసిస్టులు
విమ్స్ ప్రధాన ఆసుపత్రి పరిస్థితి మరీ దయనీయం. 17 విభాగాలు ఉన్న ఈ ఆసుపత్రికి కనీసం ఆరుగురు ఫార్మసిస్టులు అవసరం ఉండగా, ఒక్కరు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన లేరు. రెండు నెలల కిందట కేజీహెచ్ నుంచి ఒకరిని డిప్యూటేషన్‌పై వేయగా, ఆమె ఒక్కరే ఓపీ, ఐపీ మందులు, సర్జికల్స్ అన్నీ చూడాల్సి వస్తోంది. దీంతో ఓపీ విభాగంలో వార్డు బాయ్స్, ఎంఎన్‌వోలతో, ఐపీ విభాగంలో స్టాఫ్ నర్సులతో మందులు పంపిణీ చేయిస్తున్నారు. ఫార్మసిస్టులు లేకపోవడంతో గడువు తీరిన మందులు కూడా రోగులకు ఇచ్చిన సందర్భాలు చోటుచేసుకున్నాయి.
‘అభా’సేవల్లో స్టాఫ్ నర్సులు
ఈఎన్‌టీ ఆసుపత్రిలో కేజీహెచ్, విమ్స్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన స్టాఫ్ నర్సులకు వార్డుల్లో సరైన పనులు లేవు. దీంతో వారిని దిగువ స్థాయి ఉద్యోగులు చేయాల్సిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(అభా) ఐడీలు క్రియేట్ చేసే పనుల్లో కూర్చోబెట్టారు. కేజీహెచ్‌లో నర్సుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఇక్కడ అదనంగా ఉన్న వారిని వెనక్కి పంపకపోవడం గమనార్హం.


