అనకాపల్లి టౌన్ : నాగుల చవితి పండగ వచ్చిందంటే చాలు సంప్రదాయ చిమ్మిడి తయారీకి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఈ చిమ్మిడి తయారీకి రోకళ్లను ఉపయోగించేవారు. ఇందుకు ఇద్దరు మనుషులు కలిసి నువ్వులు, బెల్లం కలిపి గంటల తరబడి శ్రమించేవారు. అయితే ఈ వంటకం తయారీకి ఇప్పుడు ఆధునిక యంత్రాల సాయంతో సులభంగా తయారౌతుంది. పాతకాలం నాటి రోకళ్లు దంచే విధానాన్ని గుర్తుకు చేసేలా రెండు రోకళ్లతో పనిచేసే ప్రత్యేక యంత్రం అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని వేల్పులవీధి జంక్షన్లో ఈ యంత్రం ద్వారా ప్రజలు దగ్గర ఉండి నువ్వులు, బెల్లం మిశ్రమంతో కలిపి తయారు చేసే చిమ్మిడిని తయారు చేయించుకొని కొనుగోలు చేస్తున్నారు. కిలో నువ్వులు రూ.160, బెల్లం రూ.100 కాగా, రెండు కలిపి దంచడానికి రూ.80 వసూలు చేస్తున్నారు. ఈ మిశ్రమంతో తయారు చేసే ఉండలను నాగేంద్రుడికి నైవేద్యంగా సమర్పించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పండగకు కొన్ని రోజుల ముందు ఇంట్లోనే మహిళలు చిమిడి తయారీలో నిమగ్నమయ్యేవారు. రాతి రోలులో ప్రత్యేకమైన కర్రలకు ఇనుప బద్దీ చుట్టి ఉన్న రోకళ్లతో చిమ్మిడి తయారు చేసేవారు. కాల క్రమేణ రోకళ్లు పోయి, మిక్సీలపై ఆధారపడి చిమ్మిడి తయారు చేస్తున్నారు. అయితే పాత పద్ధతిని పోలిన రెండు రోకళ్ల యంత్రం అందుబాటులోకి రావడంతో పాటు సంప్రదాయ రుచి ఆధునిక విధానంలో లభిస్తుండడంతో ఈ చిమ్మిడిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.


