దేవరాపల్లి: గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాల నియంత్రణకు దోమ తెరలను ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) కె.వరహాలు దొర సూచించారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు సమ్మెదలో మంగళవారం ఆయన పర్యటించారు. దేవరాపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డి. వనజ, సబ్ యూనిట్ అధికారి ఎస్.వి. రమణతో కలిసి ఇంటింటా పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మలేరియా జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా దోమ తెరలను వాడాలని సూచించారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఇతర డిపార్టుమెంట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకొని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. సమ్మెద ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు మలేరియా పరీక్షలు నిర్వహించారు. జ్వరం బారినపడిన వారందరికీ మలేరియా ఆర్డీటీ పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేయాలన్నారు. జ్వరాల కేసులు అధికంగా ఉంటే వెంటనే దోమల నివారణ మందును పిచికారీ చేసి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. హెల్త్ అసిస్టెంట్ జి.బి. శ్రీనివాసరావు, ఎంఎల్‌హెచ్‌పీ ఎస్.కె. గౌతమిబేగం, ఏఎన్‌ఎం రాములమ్మ, ఆశా కార్యకర్త వరలక్ష్మి పాల్గొన్నారు.


