పరవాడ: స్థానిక జేఎన్ ఫార్మాసిటీలోని శ్రీ సాయిచందన పరిశ్రమలో శ్రీ పద్మజ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికుడు సంజిత్ కర్మాకర్(51) సోమవారం గుండెపోటుతో మృతి చెందారని పరవాడ సీఐ లంకా భాస్కరరావు తెలిపారు. వివరాలివి. ఒడిశాకు చెందిన సంజిత్ కర్మాకర్ సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విధులకు హాజరయ్యేందుకు పరిశ్రమలోని మొదటి బ్లాక్ రెండో అంతస్తుకు వెళ్తున్నాడు. మెట్లు ఎక్కుతున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్‌లో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం లంకెలపాలెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు గత నెల 24 నుంచి విధులకు హాజరవుతున్నాడు. ఈయన పనిచేస్తున్న బ్లాక్‌లో ఓమెప్రజోల్ యాంటీ అల్సర్ ఔషధాన్ని తయారు చేస్తారని సీఐ తెలిపారు. మృతుడికి ముందే ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతికి కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడవుతాయన్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశీలించారు. పద్మజ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.


