మునగపాక : మునగపాకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రసకందాయంలో పడ్డాయి. ప్రతిష్టాత్మకమైన ఎంపీపీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చనీయాంశమైంది. వివరాలు పరిశీలిస్తే మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.కౌంటింగ్ శనివారం నిర్వహించారు. ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. వైఎస్సార్‌సీపీకి 8 స్థానాలు రాగా కూటమికి మరో 8 స్థానాలు దక్కాయి. అయితే ఎంపీపీ పీఠం దక్కాలంటే కనీసం 9 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందాల్సి ఉంది. ఇరు పార్టీలకు చెరి సగం ఓట్లు రావడంతో అందరి దృష్టి మునగపాక మండలంపై పడింది. ఎంపీపీ పీఠం దక్కాలంటే ఏదో పార్టీకి చెందిన వ్యక్తి అవతల పార్టీలోకి వెళ్లాలి. అటువంటి పరిస్థితులు వైఎస్సార్‌సీపీలో కనిపించడం లేదు. మండలంలో వైఎస్సార్‌సీపీకి బలమైన క్యాడర్‌తో పాటు నమ్మకమైన పెద్దలు ఉండడంతో వైఎస్సార్‌సీపీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లే పరిస్థితులు లేవనే చెప్పాలి. అలాగే కూటమి నాయకత్వంపై మొదటి నుంచి పెద్దగా క్యాడర్‌లో విశ్వాసం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరూ కూడా చేజారకుండా ఉండేలా వైఎస్సార్‌సీపీ పెద్దలు తగు చర్యలు చేపడుతున్నారు. మున్ముందు మునగపాక ఎంపీపీ పీఠానికి సంబంధించి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
నాడు...నేడు ఒకటే ఫలితం
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు 2014లో జరిగిన ఫలితాలు పునరావృతమయ్యాయి. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 8 స్థానాలు, అలాగే అప్పటి టీడీపీకి మరో 8 స్థానాలు వచ్చాయి. అప్పటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ నేత బొడ్డేడ ప్రసాద్‌లు ఒక ఒడంబడికకు వచ్చారు. ముందు రెండున్నరేళ్ల పాటు టీడీపీకి మొదటిసారిగా ఎంపీపీ అవకాశం కల్పించారు. తరువాత రెండున్నరేళ్ల కాలం వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ అవకాశం కల్పించారు. నేడు అటువంటి ఫలితమే మరోసారి పునరావృతం కావడం విశేషం. 2026లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీకి 8 స్థానాలు రాగా కూటమి ప్రభుత్వానికి 8 స్థానాలు వచ్చాయి. ఈ పర్యాయం ఎంపీపీ పీఠం ఎవరిని వరిస్తుందో మరి?


