అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే...
ఎవరి లెక్కలు వారివే..
జోరుగా బెట్టింగ్‌లు
ఓటరు తీర్పుపై ఉత్కంఠ
ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు మొదలు కానున్న ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫలితాలు
అనకాపల్లి టౌన్ : జీవీఎంసీ కార్పొరేటర్ల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే కేంద్రీకృతమైంది. జోన్ పరిధిలో ఆరు వార్డులలో 76,950 మంది ఓటర్లు ఉండగా, 50,425 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన పాలక, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు తమ విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి, తమకు అనుకూలంగా పడిన ఓట్లు, పార్టీ బలాబలాలు, సామాజిక వర్గ సమీకరణలు ఇలా ప్రతి అంశాన్ని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులు గెలుపు లెక్కలు వేసుకొంటున్నారు. ముఖ్యంగా కొన్ని కుటుంబాలలో కొందరు ఒక పార్టీకి, మరి కొందరు మరొక పార్టీకీ ఓటు వేసారని స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలకు ఓట్లు వేయడంపై అంచనాలను లెక్కించడం విశ్లేషకులకు సైతం కష్టతరంగా మారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన అభ్యర్థులు పైకి మాత్రం తమకే మెజారీటీ ఓట్లు పడ్డాయని గాంభీర్యం వ్యక్తం చేస్తున్నా..లోపల గుబులు లేకపోలేదు. అనుచరులతో సమావేశం అవుతూ పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. చివరి నిమిషంలో ఎవరికి అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు సరి చూసుకుంటున్నారు. మరో వైపు అభ్యర్థుల అనుచరుల మధ్య జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? ఏ అభ్యర్థి విజయం సాధిస్తారు? అలాగే మెజార్టీ ఎంత అన్నదానిపై కూడా అంచనాలు వేస్తూ పందాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఓటరు మనసులో ఏముందో, ఎవరికి పట్టం కట్టారోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడేది మరి కొన్ని గంటల్లోనే..
ఓట్ల లెక్కింపు ఇలా...
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పట్టణంలోని గురప్ప కల్యాణ మండపంలో నేడు ఉదయం 8 గంటల నుంచి షురూ కానుంది. యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. 63 పోలింగ్ బూత్‌ల్లో నిర్వహించిన ఓటింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు గురప్ప కల్యాణ మండపంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపునకు 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి వాటి ఫలితాలను వెల్లడించాక, బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. 16 టేబుళ్లకు 16 వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కేటాయించనున్నారు. ఏజెంట్ల సమక్షంలో సీళ్లు తెరిచి అన్నింటినీ కలగలిపిన తర్వాత తెలుపు రంగు,గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా చేసి డ్రమ్ముల్లో వేస్తారు.తర్వాత ఆయా వార్డుల్లో పోటీలో ఉన్న వార్డు అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసి 50 చొప్పున కట్టలుగా చేసి లెక్కపెట్టి ఫలితం వెల్లడిస్తారు.16 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ 16 వార్డుల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మిగిలిన 16 వార్డుల ఓట్ల లెక్కింపు అదేవిధంగా పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు.
ఎన్నికల అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును చూపించిన వారినే భద్రతా సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రమైన గురప్ప కల్యాణ మండపం వద్ద మూడంచెల భధ్రత ఏర్పాటు చేశారు.మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ వస్తువులు,లైటర్లు,అగ్గిపెట్టెలు లాంటి వస్తువులను కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.
కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్..
నర్సీపట్నం : పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వి.వి.రమణ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో 40 వార్డులు, చైర్మన్‌కు సంబంధించి రెండు కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. చైర్మన్ ఓట్లు లెక్కింపుకు 10 టేబుల్స్, వార్డుల కౌన్సిలర్ల లెక్కింపు 10 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. చైర్మన్, కౌన్సిలర్లకు అభ్యర్ధులకు వేర్వేరుగా కౌటింగ్ జరుగుతుందన్నారు. లెక్కింపుకు మొత్తం 120 సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.జనరల్ ఎలక్షన్ ఏజెంట్లు, క్యాండిడేట్ సెలక్షన్ ఏజెంట్స్ లెక్కింపు కేంద్రంలోనికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్, పుడ్‌ఐటమ్స్, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లకు అనుమతి లేదన్నారు.సెల్‌ఫోన్లను భద్రపర్చుకునేందుకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశామన్నారు.


