సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు, ప్రచారాలు బంద్
48 గంటల నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్
తుమ్మపాల : ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బహిరంగ ప్రచారానికి ఈ నెల 3 మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచార గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేని రాజకీయ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలన్నారు. మండల కేంద్రాల్లోని లాడ్జీలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలు, ప్రైవేటు వసతి గృహాల్లో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులు ఎవరైనా ఆశ్రయం పొందితే వారిపై, సదరు యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మైకులు, లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని, ఇంటింటి ప్రచారం సైతం ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే సందేశాలు, ప్రకటనలు పంపడంపై సైబర్ విభాగం గట్టి నిఘా ఉంచుతుందన్నారు. ప్రచారం ముగిసిన సమయం నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుందని, సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఓటర్లు సహకరించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.


