తుమ్మపాల : మురసు తుపాను ప్రభావం జిల్లాలో పెద్దగా లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ పనులు యథావిధిగా చేసుకోవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి మీడియా ద్వారా ఆమె మాట్లాడుతూ మురసు తుపానుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల ద్వారా సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మురసు తుపాను కోస్తా ప్రాంతానికి దగ్గరగా వస్తుందని ప్రకటించడం జరిగిందని, జిల్లాలో ఎటువంటి తీవ్రమైన ప్రభావం లేదని, అక్కడక్కడా వర్షం పడుతుందని అన్నారు. వర్షాకాలంలో సాధారణంగా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద, విద్యుత్ పోల్స్ దగ్గర ఉండకూడదని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తుపాను తీవ్రతరంపై ఎటువంటి సమాచారం ఉన్నా జిల్లా యంత్రాంగం ముందస్తుగా తెలియజేస్తుందని పేర్కొన్నారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు
అనకాపల్లి టౌన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును పొడిగించినట్టు డీఈవో నాగేశ్వరావు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాల వల్ల చదువును మధ్యలో ఆపేసిన వారు, పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 15వ తేదీ వరకు, 200 రూపాయలు ఆలస్య రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని డీఈవో తెలిపారు.


