నక్కపల్లి : మండలంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తోంది. గొడిచర్లలో ఉన్న బీసీ వసతి గృహాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి స్టూడెంట్ యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యా సంవత్సరం మధ్యలోనే ఈ హాస్టల్ మూసివేసి ఇక్కడ చదివే విద్యార్థులను ఇతర ప్రాంతాల్లో ఎస్సీ హాస్టళ్లలో చేర్పించేందుకు నిర్ణయించిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే మండలంలో గొడిచర్ల, నక్కపల్లిలో బీసీ వసతి గృహాలు ఉండేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్కపల్లిలో బీసీ వసతి గృహాన్ని ఎత్తివేసి ఎస్సీ వసతి గృహంలో విలీనం చేశారు. తాజాగా గొడిచర్లలో ఉన్న బీసీ వసతి గృహాన్ని కూడా ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ సుమారు 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. గొడిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతూ ఈ హాస్టల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ వసతి గృహంలో ఎక్కువగా తీరప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఆశ్రయం పొందుతున్నారు. వారి తల్లిదండ్రులు వేట కోసం తాత్కాలికంగా వలస వెళ్తుంటారు. తమ పిల్లలకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో వారు ఈ బీసీ వసతి గృహంలో పిల్లల్ని చేర్పించారు. రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల, చినతీనార్ల, బంగారయ్యపేట, దొండవాక తదితర గ్రామాలతో పాటు మండలంలో పలు గ్రామాలకు చెందిన ఇతర సామాజిక వర్గానికి చెందిన పిల్లలు కూడా ఈ హాస్టల్లో ఉంటున్నారు. రాబోయే వారం పదిరోజుల్లో ఈ హాస్టల్ మూసివేస్తున్నారన్న సమాచారం విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. మండలంలో ఎక్కడా బీసీ వసతి గృహం లేదని ఉన్న ఒక్క బీసీ వసతి గృహాన్ని ఎత్తివేస్తే వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి ఏంటంటూ వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరిని ఎస్సీ వసతి గృహంలో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ బీసీ విద్యార్థులందరికీ అక్కడ ప్రవేశాలు ఇవ్వరు. మొదటి ప్రాధాన్యం కింద ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి తర్వాతే బీసీ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారని, ఇలా చూస్తే బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వారు వాపోతున్నారు. ఇక్కడ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్లే హాస్టల్ ఎత్తివేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. కొద్దిపాటి నిధులు మంజూరు చేసి భవనాలు మరమ్మతులు చేయించకుండా హాస్టల్ ఎత్తివేయడం సమంజం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే గ్రామంలో కొనసాగుతున్న హాస్టల్‌ను ఎత్తివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా..
ఇప్పటికే జిల్లాలో పలు బీసీ హాస్టళ్లను ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా గొడిచర్ల హాస్టల్ కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే ఎత్తివేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తోంది. బీసీలకు ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది. ఇక్కడ వసతి గృహం ఎత్తివేస్తే ప్రజాసంఘాలతో కలిపి పోరాటం చేస్తాం. హోంమంత్రి నియోజకవర్గంలో బీసీలకు వసతి గృహం లేకపోవడం దారుణం. దీనికి మంత్రి సమాధానం చెప్పాలి. వసతి గృహం ఎత్తివేస్తే ఎక్కువగా మత్స్యకారులే నష్టపోతారు. వారి పిల్లలే ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
–మైలపల్లి బాలాజీ,
స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు


