నర్సీపట్నం : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ తుహిన్‌సిన్హా పేర్కొన్నారు. శనివారం నర్సీపట్నం టౌన్ పోలీసు స్టేషన్ మైదానంలో ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. శనివారం సాయంత్రం నుండి పోలింగ్ బూత్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లు భయబ్రాంతులకు గురికాకుండా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లను క్రమబద్దీకరించాలన్నారు. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి తగిన సహాయం అందించాలన్నారు. రిటర్నింగ్ అధికారుల, సెక్టోరల్ అధికారులు, పోలింగ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నిల నిబంధనావళిని పక్కాగా అమలు చేయాలన్నారు. ఓటర్లు, గుర్తింపు కార్డులు కలిగిన పోలింగ్ ఏజెంట్లు మినహా అనధికార వ్యక్తులు, రాజకీయ నాయకులను పోలింగ్ కేంద్రాల లోపలికి రానివ్వకూడదన్నారు. పీవో మినహా ఎవరూ పోలింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల దూరంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉండకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల వాహనాలను నిలిపి వేయాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయనాయకులు నగదు, మద్యం, గిఫ్ట్‌లు పంపిణీ చేయకుండా నిఘా పెట్టాలన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి వీడియో తీయాలన్నారు. స్ట్రైకింగ్, మొబైల్ టీమ్స్ నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతిరెడ్డి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ ఎ.రవికుమార్, సీఐ గపూర్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 30 అమలు
అనకాపల్లి : జీవీఎంసీ, మున్సిపాల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్.163(గతంలో 144 సెక్షన్) అమల్లో ఉంటాయని ప్రజలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. జిల్లాలో అనకాపల్లి జోన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాల్టీ ఎన్నికల కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోన్ పరిధిలో అనకాపల్లి, పరవాడ, సబ్బవరంలో కార్పొరేటర్, మేయర్ అభ్యర్ధుల ఎన్నికలు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాల్టీల్లో కౌన్సిలర్స్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పోలీస్ సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను పర్యవేక్షించాలన్నారు. ఓటర్లు, గుర్తింపు కార్డులు కలిగిన పోలింగ్ ఏజెంట్లు మినహా అనధికార వ్యక్తులను, రాజకీయ నాయకులను పోలింగ్ కేంద్రాలలోకి రానివ్వకూడదన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద గుంపులుగా చేరడం, రాజకీయ చర్చలు నిర్వహించడాన్ని నివారించాలన్నారు.


