పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల
నిర్వహణ సిబ్బంది, పోలీసులు
నర్సీపట్నం : నర్సీపట్నం పురపాలికకు ఆదివారం పోలింగ్ జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ స్థానానికి, 40 వార్డులకు ఎన్నిక జరుగుతుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. పట్టణంలో 49,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు వీలుగా పురపాలికలో 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవో, ఏపీవోలు, సహాయకులతో మొత్తం 240 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవో, నలుగురు సహాయకులను నియమించారు. పోలింగ్ నిర్వహణను పర్యవేక్షించేందుకు తొమ్మిది మంది రూట్ ఆఫీసర్లు, ఐదుగురిని జోనల్ ఆఫీసర్లగా నియమించడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో వి.వి.రమణ తెలిపారు. శనివారం మధ్యాహ్నమే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీఐ ఎస్.కె.గపూర్ తెలిపారు. 76 పోలింగ్ కేంద్రాల్లో 7 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, 31 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను నియమించామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.


