నక్కపల్లి : మండలంలో పెదదొడ్డిగల్లు ఎంపిటీసీ సెగ్మెంట్ పరిధిలో ఓట్లు కలిగిన ముస్లింలు మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉంటుందని ముస్లింలు, మత పెద్దలు హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి విశాఖపట్నంలో తాత్కాలిక నివాసం ఉంటున్న ముస్లింలతో నక్కపల్లి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు తదితరులతో పాటు పెదబోదిగల్లం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు విశాఖపట్నం వెళ్లి ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ముస్లింలను కలిశారు. పెదబోదిగల్లం, పెదదొడ్డిగల్లు రామకృష్ణాపురం, అప్పలపాయకరావుపేట గ్రామాల్లో వీరందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరంతా విశాఖపట్నంలో ఉపాధి, వ్యాపార రీత్యా తాత్కాలిక నివాసం ఉంటున్నారు. పెదదొడ్డిగల్లు ఎంపిటీసీగా మాజీ వైస్ ఎంపీపీ వీసం నానాజీ పోటీ చేస్తున్నారు. దీంతో నాయకులు విశాఖలో ఉంటున్న ముస్లింలను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వందలాది మంది ముస్లింలు స్థానికంగా సమావేశమై తమ మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉంటుందని స్పష్టం చేశారు. తామంతా పోలింగ్‌రోజున వచ్చి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తామని భరోసా ఇచ్చారు. మెజార్టీ ముస్లింలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలోనే ముస్లిం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. ముస్లింలను కలిసిన వారిలో పెదదొడ్డిగల్లు మాజీ సర్పంచ్ గొర్ల నాగ అప్పలరాజు, మాజీ వైస్ ఎంపీపీ వీసం నానాజీతోపాటు, ఐదు గ్రామాల ముస్లిం నాయకులు ఉమర్, తాజుద్దీన్ బాబా, నాగూరు మీరా, సుబాన్ బీబీ, యూత్ సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


