అనకాపల్లి: జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమను గెలిపించమని కోరుతున్నారు. ఒక వైపు దసరా ఉత్సవాలు, మరో వైపు ఎన్నికల ప్రచార సందడితో అన్ని వార్డులు కోలాహలంగా మారాయి. జీవీఎంసీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో అన్నిపార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక 107వ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పన్నీరు వెంకట లక్ష్మీ వార్డు పరిధి గవరపాలెం కర్రివారి వీధిలో, 108వ వార్డు అభ్యర్థి బొడ్డేడ సరోజిని గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద, 109వ వార్డు అభ్యర్థి కర్రి లలిత పూడిమడక రహదారిలో, 110వ వార్డు అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న పద్మజ నర్సింగరావుపేట చాకలిపేట, చవితినివీధి, 111వ వార్డు అభ్యర్థి దాలియా నదియా కోట్నివీధి, 112వ వార్డు అభ్యర్థి జాజుల ప్రసన్నలక్ష్మి... శ్రీరామ్‌నగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రసన్నలక్ష్మి ఓ టిఫన్ సెంటర్ వద్ద అట్లు వేసి, స్థానికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, వార్డుల ఇన్‌చార్జ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మునగపాక మండలంలో..
మునగపాక: మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్ ఉమ్మలాడలోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు మొల్లేటి నారాయణరావు, పల్లె అప్పలనాయుడు, మొల్లేటి అచ్చియ్యనాయుడు, మొల్లేటి వినోద్ తదితరులు పాల్గొన్నారు. టి.సిరసపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డేడ వీరలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొలమరశెట్టి నాయుడు అప్పలనాయుడు,మాజీ ఎంపీటీసీ మద్దాల వీరునాయుడు తదితరులు పాల్గొన్నారు.


