వెదురుపల్లి ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయండి | - | Sakshi
Sakshi News home page

వెదురుపల్లి ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయండి

Oct 20 2026 4:55 AM | Updated on Oct 20 2026 4:55 AM

అధికారులకు ఎన్నికల కమిషన్‌ ఆదేశం

52 మంది ఓటర్లను వెదురుపల్లి జాబితాలో చేర్చాలి

ఈ వ్యవహారంపై ిఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

నాతవరం: ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను యుద్ధప్రాతిపదికన సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులను ఆదేశించింది. నాతవరం మండలం రాజుపేట అగ్రహారం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో వెదురుపల్లికి చెందిన సుమారు 52 మంది ఓటర్ల పేర్లు నమోదైన వ్యవహారంపై స్పందించింది. ఈ ఓటర్లను రాజుపేట అగ్రహారం జాబితా నుంచి తొలగించి, గతంలో మాదిరిగా వెదురుపల్లి పంచాయతీ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. వెదురుపల్లికి చెందిన ఈ ఓటర్లకు అక్కడే రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు, నివాస గృహాలు, భూములు ఉన్నప్పటికీ రాజుపేట అగ్రహారం పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై రాజుపేట అగ్రహారం మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు గుడపర్తి అచ్చియ్యనాయుడు గత నెల సెప్టెంబరు 7న నాతవరం తహసీల్దార్‌ ఓ.చందనరేఖకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసి ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలని కోరారు. పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినా స్పందన లేకపోవడంతో ఈ నెల 12న జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రెండు పంచాయతీల ఓటర్ల జాబితాలను పరిశీలించి, అదే రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక పంచాయతీకి చెందిన ఓటర్లు మరో పంచాయతీ జాబితాలో నమోదవడంతో ఎన్నికల రోజున ఓటు హక్కు వినియోగించుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల సుమారు 52 మంది ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌, మాజీ సర్పంచ్‌ అచ్చియ్యనాయుడు చేసిన ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి, సంబంధిత ఓటర్ల పేర్లను వెదురుపల్లి పంచాయతీ జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషన్‌ నుంచి పంపిన లేఖ సోమవారం రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా అచ్చియ్యనాయుడుకు అందింది. ఈ సందర్భంగా అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ అధికారుల తప్పిదాల వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని, స్థానికంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పందించడం హర్షణీయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement