మాడుగుల రూరల్: భవానీ భక్తులతో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం పాడేరు ఘాట్‌రోడ్డులో బొలేరా వాహనం బోల్తా పడింది. ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో భవానీ మాలధారణ భక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన 21 మంది భవానీ భక్తులు సోమవారం పాడేరు మోదమాంబ ఆలయానికి బొలేరా వాహనంపై వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఘాట్‌రోడ్డు కోమలమ్మ పణుకు సమీపంలో వాహనం బ్రేక్‌లు ఫెయిలై బండరాయిని ఢీకొని బోల్తా పడింది. వెంటనే క్షతగాత్రులను మాడుగుల సీహెచ్‌సీకి తరలించారు. దీంతో వారిలో వి. పూజిత (17)కు తీవ్ర గాయాలై మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తలకు తీవ్ర గాయాలైన ఎం. ముసిలినాయుడు (50) అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మిగిలిన వారులో తీవ్రంగా గాయపడిన నలుగురిని కె.జె.పురం, బుచ్చెయ్యపేట 108 వాహనాల్లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాడుగుల సీహెచ్‌సీ వైద్యులు నరేష్, నాయుడు, సిబ్బంది అత్యవసర సేవలు అందించారు. ఎస్ఐ జి. నారాయణరావు తన సిబ్బందితో ఆస్పత్రికి చేరుకోని వివరాలు సేకరించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న జుత్తాడ గ్రామస్తులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోని రోదించారు. గాయపడిన వారిలో ఆర్. రాజారావు, ఎం. పవిత్ర, ఎం. పద్మిని, వి. ద్వారక తనుజా, ఎం. పావని, కె. కావ్యశ్రీ, ఆర్. ప్రసన్న, పరిదేశమ్మ, ఎం. రేష్మ, ఎం. యుమన, కావశ్రీ, ప్రసన్న, వంశీ, కె. ధరణి, ఆర్. ప్రసాద్, తరుణ్, ఎం. జయ, సుందర్, తదితరులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వీరికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది తమ సొంత వాహనాల్లో స్వగ్రామానికి వెళ్లిపోయారు.


