ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే పరిసరాలు... మైదానంలో మన్యం అందాలను తలపించే గిరి శిఖరాలు... జలపాతాలు, తీర ప్రాంతాల సోయగాలు, ఏలేరు కాలువ పరవళ్లు, తాండవ జలాశయం...సుందరకోట అడవులు..ఘాట్‌రోడ్డులో మైమరిపించే దృశ్యాలు... ఇక వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి... సినీ ప్రేక్షకులను మైమరపించనున్నాయి... తరుచూ సినిమా షూటింగ్‌లతో జిల్లాలోని అందమైన లొకేషన్లు వాసికెక్కుతున్నాయి...
షూటింగ్‌లకు అనువైన ప్రాంతంగా తాండవ ప్రాజెక్టు ఊపందుకున్న సినిమా చిత్రీకరణలు నవంబర్, డిసెంబర్‌లో షూటింగ్‌లకు లొకేషన్ల పరిశీలనలు తరలివస్తున్న చిత్ర బృందాలు
నీటిలో బోటుపై కెమెరాతో షూటింగ్ దృశ్యాలు (ఫైల్)
నాతవరం : ఉమ్మడి విశాఖతో సినీ పరిశ్రమకు ఎంతో అనుబంధం ఉంది. విశాఖ తీర ప్రాంతాలు, మన్యం అందాలను తెరపై ఆవిష్కరించి ఎన్నో ప్రముఖ చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొని ప్రేక్షకులను రంజింపజేశాయి. ఇపుడు మన్యానికి ముఖద్వారం వంటి నర్సీపట్నం పరిసరాల్లో అందమైన లొకేషన్లు సినీ షూటింగ్‌లకు రారమ్మని పిలుస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత నాతవరం మండలంలో పలు ప్రాంతాలు సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారాయి. జిల్లాలో గల 24 మండలాల్లో ఎక్కడా లేని విధంగా తాండవ రిజర్వాయరు, సరుగుడు, సుందరకోట అడవులతో ఘాట్‌రోడ్డు, జలపాతాలు, ఏలేరు కాలువ సొరంగం మార్గాల్లో తరుచూ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. తాండవ ప్రాజెక్ట్ వద్ద ఇంతవరకు ఐదు సినిమాలకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించారు. కనుచూపు మేర తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు మరో పక్క ఎత్తయిన కొండలు, ఏజెన్సీని తలపించేలా ఘాట్ రోడ్డు సినిమా షూటింగ్‌లకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా తాండవ రిజర్వాయరు, సరుగుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు సినీ దర్శకులు నిర్మాతలు సినిమా షూటింగ్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ సినిమా అరిస్టులు రాజేంద్రప్రసాద్, బెనర్జి, ఆర్.నారాయణమూర్తి, బ్రహ్మాజితో పాటు ఆదర్శ బాలకృష్ణ, జోగి బ్రదర్స్, ఇతరత్రా పలువురు అరిస్టులు తాండవ ప్రాజెక్టులో సినిమాకు సన్నివేశాలు చిత్రీకరణలో పాల్గొన్నారు. సుందరకోట ఘాట్ రోడ్డు కొండలపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, జీవీఎంసీ ఇతర పరిశ్రమలకు ఏలేరు కాలువ ద్వారా నీరు సరఫరా చేసేందుకు జిల్లేడుపూడి వద్ద ఏర్పాటు చేసిన సొరంగ మార్గంలోనూ షూటింగ్‌లు జరిపేందుకు లోకేషన్లు పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో పలు చిత్ర బృందాలు సన్నివేశాలు ఇక్కడ షూటింగ్‌లు జరిపే అవకాశం ఉంది. తాండవ ప్రాజెక్టు, సుందరకోట ప్రాంతాల్లో ఇటీవల ‘అనుభవించు రాజా’ సినిమా డైరెక్టరు గవిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదర్శ బాలకృష్ణ, పలువురు ఆర్టిస్టులతో సినిమా షూటింగ్ జరిపారు. శ్రీనివాస్ తీసే సినిమాల్లో స్థానిక కళాకారులకు నటించే అవకాశం కల్పించారు. నవంబరు, డిసెంబరు నెలలో ప్రముఖ హీరోయిన్ అనుష్కతో పాటు పెద్ద హీరోలు తాండవలో షూటింగ్‌కు వస్తారని ప్రచారం జరుగుతుంది.
పొలాచ్చిని తలపించేలా...
తాండవ రిజర్వాయరు లాంటి నీటి మట్టం ఉన్న ప్రాంతం కోసం పలు సినిమాల్లో దృశ్యాలను చిత్రీకరించేందుకు షూటింగ్‌కు పొలాచ్చి వెళ్లాం. పొలాచ్చి ప్రాంతాన్ని తలపించేలా ఇక్కడ తాండవ ప్రాజెక్టు ఉంది. తక్కువ ఖర్చుతో ప్రేక్షకులను మరిపించే దృశ్యాలను ఈ రిజర్వాయరు సమీపంలో చిత్రీకరించవచ్చు. ఇటీవల కొత్త సినిమా షూటింగ్‌ను తాండవలో జరుపుతున్నాం. రానున్న కాలంలో ఈ ప్రాంతాల్లో మరిన్ని షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను.
– గాంధీ, ఆర్ట్ డైరెక్టర్, హైదరాబాద్
అందమైన లొకేషన్లు
కరోనా సమయంలో మా సొంత గ్రామం చెర్లోపాలెం వచ్చినప్పుడు తాండవ ప్రాజెక్టు, ఇతర ప్రాంతాలనుస స్వయంగా చూశాను. సినిమా షూటింగ్‌లకు కావలసి అందమైన లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని ‘మా’ ఎన్నికలు జరిగినప్పుడుకొందరు సినీవర్గాల వద్ద ప్రస్తావించాను. కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు ఇక్కడకు స్వయంగా వచ్చి లొకేషన్లు చూసి సినిమా షూటింగ్‌లు జరుపుతున్నారు. అది చూసి చాలా ఆనందపడ్డాను.
ఎల్.జోగినాయుడు (జోగిబ్రదర్స్) సినీ నటుడు
ఊహించలేదు
ఇక్కడ ఇలాంటి అందమైన లొకేషన్లు ఉన్నట్టు ఇంతవరకూ నాకు తెలియదు. తాండవ ప్రాజెక్టు, సుందరకోట కొండలపై ఉన్న ఘాట్ రోడ్డుపై ఐదు రోజుల పాటు సినిమా షూటింగ్‌లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించాం. వచ్చే నెలలో ప్రముఖ హీరో, హీరోయిన్లతో ఇక్కడ షూటింగ్‌లు జరపనున్నాం.
–గవిరెడ్డి శ్రీనివాస్ సినిమా డైరెక్టర్


