సాక్షి, అనకాపల్లి : ‘గెడ్డ భూముల కబ్జాకు స్కెచ్!’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ సిబ్బంది స్పందించింది. అనకాపల్లి మండలంలోని గోపాలపురం శివారు వెంకటరమణ పేట సర్వే నంబర్ 107లోని 16 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిలో యూకలిప్టస్ చెట్లను నరికివేత, ఆక్రమణలపై సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆయా యూకలిప్టస్ చెట్లను నరికేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించి, భూముల హక్కుకు సంబంధించి ఉన్న ధ్రువీకరణ పత్రాలతో తహసీల్దార్ రమ్మని కోరినప్పటికీ ఎవరూ రాలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శనివారం మధ్యాహ్నం వీఆర్‌వో చంద్రశేఖర్ పర్యవేక్షణలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సదరు భూముల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించినా, ఆక్రమించేందుకు యత్నించినా సెక్షన్ 4(1), 4(2),4(3) ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సదరు బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం.


