అన్నవరం : సత్యదేవుని దర్శనానికి వస్తున్న భవానీ భక్తుల ఆటో శనివారం దేవస్థానం ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీదీక్షధారులకు గాయాలయ్యాయి. వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేవు పోలవరం శివారు గుడివాడకు చెందిన ఐదుగురు భవానీలు దీక్ష పూర్తి చేసుకుని, శనివారం సత్యదేవుని ఆలయానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రత్నగిరి మొదటి ఘాట్ రోడ్డు రెండో మలుపులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భవానీలు సంజయ్, సురంధర్ గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే దేవస్థానం అధికారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


