ట్రాఫిక్ పోలీసులు స్వాధీనపర్చుకున్న ఓవర్ లోడ్‌తో వెళతున్న లారీ
యలమంచిలి రూరల్ : పరిమితికి మించి ఫ్లైయాష్ లోడ్‌తో వెళ్తున్న రెండు పెద్ద టిప్పర్ లారీలకు ఒక్కోదానికి రూ.20,035 చొప్పున మొత్తం రూ.40,070 జరిమానా విధించినట్టు యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐ బెజవాడ రామకృష్ణ తెలిపారు. ఈ రెండు వాహనాలు పరవాడ నుంచి కాకినాడకు వెళ్తున్నాయని, అధిక లోడుతో పాటు వాటి నుంచి ఫ్లైయాష్ రహదారిపై ఎగిరి పడేలా నిర్లక్ష్యం వహించినట్టు గుర్తించామన్నారు. వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, అధిక లోడుతో ప్రయాణించకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రహదారిపై ప్రయాణించేవారికి ఇబ్బంది కలిగించడం, ప్రమాదాలు జరిగేందుకు కారణమయ్యే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.


