కె.కోటపాడు: మహిళలు, విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ హెచ్చరించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఎ.కోడూరులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టులను ఆశ్రయించి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే జీవితం చెడు మార్గంలో పయనిస్తుందని హెచ్చరించారు. కె.కోటపాడు సీఐ కిలపర్తి కృష్ణ మాట్లాడుతూ యువత మంచి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని సూచించారు. న్యాయవాదులు డి.శివప్రసాద్, ఎస్.అప్పారావు పాల్గొన్నారు.


