యలమంచిలి రూరల్: పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం రద్దీగా ఉన్న పల్లెవెలుగు బస్సు నుంచి ఓ విద్యార్థిని జారిపడి గాయపడింది. అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్తున్న అనకాపల్లి డిపోకు చెందిన బస్సు నుంచి జారిపడిన విద్యార్థినిని యలమంచిలి మండలం పులపర్తికి చెందిన కె.స్వాతిగా తోటి విద్యార్థులు గుర్తించారు. సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు విడిచిపెట్టే సమయంలో వందలాది మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


