అత్తారింట్లో అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

అత్తారింట్లో అనుమానాస్పద మృతి

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

సబ్బవరం: దేవరాపల్లికి చెందిన మొల్లి సతీష్‌(28) మండలంలోని గుల్లేపల్లిలో ఉన్న తన అత్తారింట్లో ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య, అత్తింటి వేధింపులే మృతికి కారణమని అతడి సోదరుడు వంశీ ఆరోపించారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మొల్లి సతీష్‌కు గుల్లేపల్లికి చెందిన జయశ్రీతో 2021లో వివాహమైంది. వీరికి శాన్విక(4), చేతన్‌(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం దేవరాపల్లిలో నివసించిన దంపతులు అనంతరం గుల్లేపల్లికి మారారు. సతీష్‌ తన స్వగ్రామంలోని బంధువులు, స్నేహితుల వద్ద సుమారు రూ.40 లక్షలు అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని గుల్లేపల్లిలో స్థలం కొనుగోలుకు పెట్టుబడిగా పెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పులు ఇచ్చినవారు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఇటీవల ఆ స్థలాన్ని సుమారు రూ.40 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు. అయితే, ఆ డబ్బును అప్పులు తీర్చేందుకు ఇవ్వాలని సతీష్‌ కోరినా భార్య, అత్తింటివారు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. గతంలోనూ డబ్బుల విషయమై ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తడంతో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకుని, పంచాయితీలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీష్‌ ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం అందడంతో అతడి సోదరుడు వంశీ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సతీష్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు మాట్లాడుతూ.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు, మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.

భార్య, అత్తింటి వేధింపులే కారణమని మృతుడి కుటుంబ సభ్యుల అరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement