తుమ్మపాల: యువతలోని సృజనాత్మకతను వెలికి తీసి, వారి ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎం.వినోద్‌బాబు తెలిపారు. యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి మండలం రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎం.వినోద్‌బాబు, జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఐవీవీఎస్ శ్రీనివాసరావు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.రమ్యజ్యోతి జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. యువజనోత్సవాల్లో భాగంగా జానపద గేయాలు, జానపద నృత్యాలు, నుక్కడ్ నాటక్, పెయింటింగ్, కవిత్వం తదితర ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. యువత తమలోని నైపుణ్యాలను గుర్తించి, వివిధ రంగాల్లో రాణించేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


