ఎస్.రాయవరం: ఆగి ఉన్న ట్రాలీని వ్యాన్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రమేష్ శుక్రవారం తెలిపిన వివరాలివి. ఓ వ్యాన్ అనకాపల్లి నుంచి ద్వారపూడి వెళ్తుండగా, అడ్డురోడ్డు వద్దకు చేరుకునేసరికి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రహదారిపై ఆగి ఉన్న ట్రాలీని వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సిరిపురి శ్రీనివాస్, కోరనాల నాగబాబు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. నాగబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని బయటకు తీసి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగబాబు మృతి చెందాడు. డ్రైవర్, శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


