అనకాపల్లి : జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర డీఎస్పీగా డి.శ్రీహరిరాజు గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాద పూర్వకంగా కలిసి రాజు పుష్ఫగుచ్ఛం అందజేశారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లాకు రావడం జరిగిందని డి.శ్రీహరిరాజు చెప్పారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీగా విధులు నిర్వహించి, సాధారణ బదిలీలో ఇక్కడకు రావడం జరిగిందన్నారు.
ఎస్పీని కలిసిన డీఎస్పీ నరసింహారావు
అనకాపల్లి నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి.వి.వి.నరసింహారావు గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దిగువ స్థాయి సిబ్బందితో నిత్యం సమావేశాలు నిర్వహించి, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఉన్నతస్థాయి అధికారుల సూచనల మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.


