అనకాపల్లి : సేవా సంకల్ప్ అబియాన్–2026 కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ వరకూ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ విజయకృష్ణనన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో గురువారం మెగా ఉచిత వైద్యశిబిరాన్ని వారు ప్రారంబించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా పిల్లల దత్తత తీవ్ర నేరమని, డీఏఆర్‌ఏ పోర్టల్ ద్వారానే పిల్లల దత్తత తీసుకోవాలన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ విభాగ పరిధిలో ప్రత్యేక దత్తత విభాగం కొనసాగుతుందన్నారు. 0 నుంచి 6 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను సంరక్షణార్థ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, చిన్నారులకు అన్నప్రాసనము చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, డీసీహెచ్‌ఎస్ ఎస్.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు.


