సర్వే సిబ్బందితో మాటల్లాడుతున్న ఎప్బీవో వసంత
మాకవరపాలెం : పైడిపాల రెవెన్యూలో జరుగుతున్న సర్వేను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూల్లో అధికారులు 4250 ఎకరాలను ఎంపిక చేశారు. దీనిలో భాగంగా మొదటగా రైతుల ఆక్రమణల్లో ఉన్న 630 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి రైతుల జాబితాలను వెల్లడించారు. వీటిలో భూములు లేని వారి పేర్లు జాబితాల్లో చేర్చారని, ఇక భూమి ఎక్కువగా ఉన్నా తక్కువ ఉన్నట్టు చూపారంటూ రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పైడిపాల రెవెన్యూలో సర్వే చేపట్టారు. దీనిని ఫారెస్ట్ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. సర్వే చేస్తున్న భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వసంత రెవెన్యూ సర్వే సిబ్బందికి తెలిపారు. దీంతో సర్వే నిలిపివేశారు. ఇదే విషయమై తహసీల్దార్ నూకరాజుతో మాట్లాడగా ఫారెస్ట్ భూమిగా ఉన్న రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


