కశింకోట : మండలంలోని జమాదులపాలెం గ్రామంలో గౌరీ పరమేశ్వరుల (గౌరమ్మ) ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. అమ్మవారిని స్థానికులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించి చీరలు, రవికెలు, తలనీలాలు, అరటి గెలలు తదితర రూపాల్లో సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ గౌరమ్మను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ కాలనీ నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా పార్టీ శ్రేణులు తీసుకు వచ్చారు. మంగళ హారతులతో స్వాగతం పలికి పూలమాలలు వేసి దుశ్శాలువాలు కప్పి సత్కరించారు. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మలసాల కిషోర్, జిల్లా కార్యదర్శి కరక సోమునాయుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, మండల మాజీ ప్రధాన కార్యదర్శి కరక శేషు, పార్టీ నాయకులు ఒమ్మి గంగునాయుడు, వియ్యపు భూలోకనాయుడు, నాగ అప్పారావు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు గూడుపు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాంకీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మురళీధర్, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఒమ్మి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరిగింది. రాత్రి గౌరమ్మ విగ్రహాన్ని గ్రామంలో డప్పులు, వాయిద్యాలు, నేల వేషాలు, బాణసంచా నడుమ ఊరేగించి, చెరువులో నిమజ్జనం చేశారు. డాన్స్ బేబీ డాన్స్ వంటి పలు సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు లక్ష్మణరావు, సతీష్, సిబ్బంది పోలీస్ బందోబస్తు నిర్వహించారు.


