అక్కిరెడ్డిపాలెం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. జీవీఎంసీ 68వ వార్డు పరిధి మింది ఎస్సీ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష, గుడివాడ లతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గొల్ల బాబురావు మాట్లాడుతూ.. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకాలన్నారు. మల్టీపర్పస్ భవనం, మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన దాతలు, గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఎస్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించిందన్నారు. మింది అభివృద్ధికి గొల్ల బాబూరావు గతంలోనూ సహకరించారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు చిన్నారావు, గనుగుల శ్యామలరావు రూ.23 వేలు, జగ్జీవన్‌రామ్ విగ్రహానికి గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ రూ.23 వేలు, పార్కు అభివృద్ధికి రూ.75 వేలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ గుడివాడ అప్పల రామ్మూర్తి, వార్డు అధ్యక్షుడు సండ్రాన నూకరాజు, నాయకులు చిన్న హుస్సేన్, ఎస్సీ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.


