నిరాహార దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్.జయలక్ష్మి, కన్వీనర్ రాజాబాబు, ప్రధాన కార్యదర్శి జయరత్నం డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి సుమారు రెండున్నరేళ్లు కావస్తున్నా అమలు చేయకపోవడంతో దశలవారీగా ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 100 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 15 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా తమ సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్.భద్రం, అసోసియేషన్ ఉద్యోగులు జగదీశ్వరీ, దుర్గ, ఇమామ్, సౌజన్య, సందీప్, మోహన్, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.


