నక్కపల్లి: ఓటమి భయంతోనే పెదతీనార్ల, పెంటకోట మత్స్యకార సొసైటీ ఎన్నికలు వాయిదా వేశారని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ హోంమంత్రి అనిత నియోజకవర్గంలో చిన్న గ్రామంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టలేని ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. ఒక పక్క బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం దొంగ వాగ్దానాలు చేస్తూ మరో పక్క బీసీలైన మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో గెలిచే సత్తాలేక ఎన్నికలు వాయిదా వేయిస్తున్నారన్నారు. సత్తా ఉంటే పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. రాజయ్యపేట ఎన్నికల్లో కూడా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. ‘పింఛన్లు రద్దు చేస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఆపేస్తాం, రేషన్ కార్డులు రద్దు చేస్తాం’అంటూ బెదిరించారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయి ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలా అయితే రాబోయే స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు.


