● చవితి సంబరాలకు సర్వం సిద్ధం
● వాడవాడలా వినాయక చవితికి
ఘనంగా ఏర్పాట్లు
ఏ శుభ కార్యమైనా ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతోంది. అలాంటి ఏకదంతుడి పండగంటే అందరికీ సంబరమే. సోమవారం వినాయక చవితి సందర్భంగా ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రోత్సవాలను వాడవాడలా ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. తొలి పూజ అందుకునే గణపయ్యను కొలిచేందుకు పల్లె నుంచి పట్టణం వరకూ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తొమ్మిది రోజులపాటు పిల్లలు, పెద్దలు ఎంతో నిష్టతో విఘ్నేశ్వరుడికి పూజలు చేయనున్నారు.
నక్కపల్లి/కోటవురట్ల: : చవితి ఉత్సవాలను జరుపుకోవడానికి యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతున్నారు. ఉత్సవాల కోసం ఖరీదైన మండపాలు, భారీ విగ్రహాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది వినాయక చవితికి నాలుగు రోజుల ముందు నుంచే సముద్రంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో గణపతి నవరాత్రి ఉత్సవాలకు కొంతమేర ఆటంకం ఏర్పడింది. ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేకపోవడంతో గణపతి ప్రతిమలు, పూజా సామగ్రి, పత్రులు కొనుగోలు చేయడానికి వెళ్లేవారు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం ప్రభావం పూజా సామగ్రి విక్రయాలపై కూడా పడింది. పూజా సామగ్రి, పత్రిల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండ్లు, పూలఽ ధరలను అమాంతం పెంచేశారు.
ఒడ్డిమెట్టలో నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు...
గ్రామీణ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఒడ్డిమెట్ట గణపతి నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వరంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చవితి నాడు ఇక్కడ తిరునాళ్లు జరుగాయి. వేలాది మంది స్వామివారి దర్శనం కోసం వస్తారు.
నేడు గిరి ప్రదక్షిణ...
ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి గిరి ప్రదక్షిణ సోమవారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవరాత్రుల్లో మొదటి సారిగా గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి, పాత రోడ్డు మీదుగా రెండు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు, భజన బృందాలు, కోలాట బృందాలు ఈ గిరి ప్రదక్షిణలో పొల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం కై లాసగిరిపై లక్ష్మీగణపతి ఆలయం వద్ద అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నారు.


