మండలంలో ములగపూడి వద్ద తాండవ కాలువలో ప్రవహించని సాగునీరు
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీరు ఆయకట్టుకు కేవలం 25 రోజులే ప్రవహిస్తుందని అధికారులు ప్రకటనతో రైతులు ఆందోళన మొదలైంది. జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజక్టు తాండవ రిజర్వాయరులో క్రమేపీ నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. ఖరీఫ్ పంట సాగు చేసేందుకు గత నెల 11వ తేదీన తాండవ ప్రాజక్టు నుంచి గేట్లు ఎత్తి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసే సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 375.2 అడుగులు ఉండేది. ఈ నీటిని రెండు కాలువల ద్వారా రోజుకు 750 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 70 రోజులు ప్రవహిస్తుందని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు అధికారులు, రైతుల ఆశలకు విరుద్ధంగా ఉండడంతో నీరు తాండవలో దారుణంగా తగ్గిపోతోంది. ప్రస్తుతమున్న నీరు ఆయకట్టుకు కేవలం 25 రోజులే ప్రవహించే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
బోర్లుపైనే ఆధారం..
మండలంలో ఈఏడాది ఖరీ్‌ఫ్ సీజన్‌లో వరి పంట సాగు లక్ష్యం 6,297 హెక్టార్లు కాగా నేటికి 2,600 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశామని ఇంకా నాట్లు వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మండలంలో వ్యవసాయ బోర్లు, ఏలేరు కాలువ లీకేజీ నీటితో ముందుగా వేసుకున్న వరినాట్లు ఏపుగా పెరుగుతుంటే కొందరు రైతులు దమ్ములు చేస్తున్నారు. మరికొందరు వరి నారుమడులు సిద్ధం చేసుకుని నాట్లు వేసుకోవడానికి నీరు కోసం ఎదురు చూస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రాజెక్టు నుంచి నీటిని రోజుకు 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా కాలువలో నీటి ప్రవాహం నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ మండలంలో పూర్తిగా నీరు ప్రవహించకపోతే ప్రాజెక్టు పరిధిలో శివారు ఆయకట్టుకు నీరు ఎప్పుడు ప్రవహిస్తుందని రైతులు అంటున్నారు. ఇంకా వేలాది ఎకరాల్లో వరినాట్లు వేయకుండా వృథాగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు దాటితే వరినాట్లు వేయరాదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈఏడాది తాండవ ఆయకట్టు పరిధిలో రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రాజెక్టులో నీరు తగ్గడంతో తాండవ వద్ద కాలువలో నెమ్మదిగా నీటి ప్రవాహం
తాండవలో గణనీయంగా తగ్గిన నీటి మట్టం
శివారు భూములకు నీరు అందడం కష్టమేనంటున్న అధికారులు
రైతుల ఆశలపై నీళ్లు
తాండవ ప్రాజెక్టు నీటిపై అధారపడి ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని, రవతలపూడి, శంఖవరం మండలాల్లో సుమారుగా 52 వేలు ఎకరాలు ఆయకట్టు ఉంది. తాండవ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీరు సుమారుగా 120 కిలోమీటర్లు పొడవునా పెద్ద చిన్న కాలువలు నిర్మించారు. ఈ ఏడాది వర్షాలు కురవపోవడంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేసి నెల రోజులు కావస్తున్నా నేటికీ నీరు నాతవరం మండలానికి పూర్తిగా ప్రవహించలేదు. తాండవ శివారు ఆయకట్టుకు ఈ ఏడాది నీరు సరఫరా చేయలేమని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు.
చివరి ఆయకట్టుకు నీళ్లివ్వలేం..
వర్షాలు కురవకపోతే ప్రస్తుతం తాండవలో ఉన్న నీరు కేవలం 25 రోజులు మాత్రమే ఆయకట్టుకు ప్రవహిస్తుంది. మేము ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించదు. –అనురాధ, తాండవ ప్రాజెక్టు డీఈఈ
కొర్రలు, చోళ్లు విత్తనాలకు ప్రతిపాదనలు
వరినాట్లు వేయలేని రైతులు కోసం కొర్రలు, చోళ్లు వేసేందుకు విత్తనాలు సరఫరా చే సేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం.
–సుగుణ, మండల వ్యవసాయాధికారి
అందుబాటులో చిరుధాన్యాలు, అపరాల విత్తనాలు
తుమ్మపాల: ఖరీఫ్ సీజన్‌లో ఎల్–నినో కారణంగా వర్షాభావ పరిస్ధితులు ఏర్పడినందున రైతులు వరిసాగుకు బదులు చిరుధాన్యాలు సాగుచేసుకుంనేందుకు రైతు సేవా కేంద్రాల్లో చిరు ధాన్యాలు, అపరాలు విత్తనాలు అందుబాటులో ఉంచినట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నాటికి 532.3 మీల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 243.1 మీల్లీమీటర్ల మాత్రమే నమోదైందని, 53 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు లేక సాగు విస్తీర్ణం సాధారణ విస్తీర్ణంతో పోల్చితే 26 శాతం మాత్రమే జరిగిందన్నారు. జిల్లా ప్రధాన పంట వరి 25 శాతం మాత్రమే సాగు జరుగుతుందన్నారు. ప్రస్తుత ఎల్–నినో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కార్యాలయంలో రైతులకు ఉపయుక్తంగా వారి పంటల స్థితిగతులపై కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమైందన్నారు. ఫోన్ ద్వారా ఎన్.సరోజినీదేవి– 8331056471, ఎస్.రవికిరణ్ –98491 81809, అన్ని మండలాల వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్‌లతో కాల్‌సెంటర్ కొనసాగుతుందన్నారు.


