కొక్కిరాపల్లి గురుకులంలో డీసీవో విచారణ | - | Sakshi
Sakshi News home page

కొక్కిరాపల్లి గురుకులంలో డీసీవో విచారణ

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

యలమంచిలి రూరల్‌: కొక్కిరాపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో నకిలీ నియామక పత్రాలతో ఉద్యోగ నియామకాల వ్యవహారంపై ఉమ్మడి విశాఖ జిల్లా అంబేడ్కర్‌ గురుకులాల సమన్వయకర్త ఎన్‌.రామకృష్ణ మంగళవారం విచారణ జరిపారు. కొక్కిరాపల్లి గురుకులానికి వచ్చిన ఆయన నకిలీ నియామక పత్రాలతో ఒక యువతిని హెల్త్‌ అసిస్టెంట్‌గా విధుల్లోకి తీసుకోవడంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం. మాణిక్యం, బోధనా సిబ్బందిని ప్రశ్నించారు. ఆ యువతి ఆగస్టు చివరి వారం నుంచి గురుకులంలో విధులు నిర్వర్తించినట్టు తేలింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆమెను గురుకులంలోకి ఎలా అనుమతించారన్న దానిపై డీసీవో ఆరా తీశారు. మరో ఇద్దరు యువతులకు కూడా డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో నియమించినట్టు నకిలీ నియామక పత్రాలను ఇచ్చిన దళారీ ముఠా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేయడానికి వేసిన స్కెచ్‌ సాక్షిలో కథనం రావడంతో విఫలమైంది. సోమలింగపాలేనికి చెందిన మరొక యువతికి కూడా రూ.3.50 లక్షలకు పోస్టు ఇప్పిస్తామని చెప్పిన దళారీ అడ్వాన్సుగా రూ.లక్ష చెల్లించాలని చెప్పినట్టు తెలుసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న గురుకులంలోకి నకిలీ నియామక పత్రాలతో బయటి వ్యక్తులను విధుల్లోకి తీసుకోవడం, మరికొంత మందిని అనుమతించేందుకు అనుకూలంగా వ్యవహరించడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసగించడానికి యత్నించారు. అయితే సాక్షిలో దళారులు గురుకులాలను లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగులను మోసగిస్తున్న వైనంపై కథనం రావడంతో చాలా మంది కేటుగాళ్లు అప్రమత్తమయ్యారని డీసీవో రామకృష్ణ అన్నారు. విచారణలో భాగంగా నకిలీ నియామక పత్రంతో కొద్ది రోజులు విధులు నిర్వర్తించిన యువతికి సంబంధించి గురుకులంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించలేదని సాక్షికి చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ జరుపుతున్నామని, నివేదికను సిద్ధం చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement