అనకాపల్లి: రాష్ట్రంలో ప్రజారవాణాశాఖ (ఆర్‌టీసీ) ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థకి ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలని, పినాకిల్‌తో చేసుకున్న ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని ప్రజారవాణాశాఖ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎన్.వి.పరమేశ్వరరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సీఐటీయూ, పలు సంఘాలు బుధవారం మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు 2 డిపో పరిరక్షణకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిరసన దీక్షలు చేయడం జరిగిందన్నారు. పినాకిల్ సంస్థతో 1050 ఎలక్ట్రికల్ బస్సులను ఆ సంస్థ ద్వారా నడపాలనే ఒప్పందం చేసుకోవడం అత్యంత దుర్మార్గమని, రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు డిపోలను దీర్ఘకాలికంగా లీజు పద్ధతిలో ఇవ్వడానికి కార్మికులు వ్యతిరేకించారన్నారు. 212 రోజులుగా నెల్లూరు 2 డిపో వద్ద నిరసన దీక్షలు కొనసాగుతున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందన్నారు. దీక్షలు ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు బత్తిన అప్పారావు, ఎస్.ఆర్.త్రిమూర్తులు, ఎంపీ నాయుడు, ఈ.ఎస్.రావు చేపట్టారు. నిరసనలో ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


