ఏసీబీ వలలో వారాడ వీఆర్వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వారాడ వీఆర్వో

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

1బీ పత్రాన్ని ఇచ్చేందుకు రూ.20 వేలు డిమాండ్‌ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్న ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ హర్షిత

కె.కోటపాడు : భూమికి సంబంధించి ఆన్‌లైన్‌ చేసి రైతుకు 1బీ పత్రాన్ని ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్‌ చేసిన అవినీతి వీఆర్వో జి.సూర్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. కె.కోటపాడు మండలం వారాడ వీఆర్వోగా పని చేస్తున్న సూర్యనారాయణ చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రైతు బండారు నాయుడు కు చెందిన భూమిని ఆన్‌లైన్‌ చేశారు. దీనికి సంబంధించిన 1బీ పత్రాన్ని తీసుకునేందుకు రావాలని రైతు బండారు నాయుడుకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. 1బీ పత్రంతో పాటు ఇంకా ఉన్న భూమి ఆన్‌లైన్‌ పనులు చేయాల్సి ఉన్నందున తనకు రూ.20వేలు నగదును లంచంగా ఇవ్వాలని, ఈ నగదును తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న తనకు ఇవ్వాలని వీఆర్వో సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. అయితే లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రైతు బండారు నాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో వీఆర్వో సూర్యనారాయణ రైతు నాయుడు వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు అతనిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో సూర్యనారాయణపై కేసు నమోదు చేసి బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు విశాఖపట్నం ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి విలేకరులకు తెలిపారు. అవినీతికి పాల్పడే ఇతర శాఖల్లో అధికారులపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 94404 46170కు తెలపాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్టు వీరు తెలిపారు. ఈ ఏసీబీ దాడుల్లో ఏసీబీ అధికారులు సుప్రియ, వెంకటరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఇది రెండో సారి...

వారాడ వీఆర్వోగా పని చేస్తూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇది రెండోసారి అని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. గతంలో 2022లో నాతవరం మండలంలో కూడా రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్టు ఆయన తెలిపారు. కె.కోటపాడు రెవెన్యూ కార్యాలయ ఆవరణలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో సూర్యనారాయణ వార్తతో అవినీతి అధికారుల గుండెల్లో అలజడి రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement