ప్రైవేటీకరణ
సీఐఎస్‌ఎఫ్ ఉపసంహరణతో విశాఖ ఉక్కులో కలవరం
●జింక్ పరిశ్రమలోనూ తొలుత భద్రతా బలగాల తొలగింపు.. ఆ తర్వాతే మూత
●కూటమి వచ్చాక ప్లాంట్‌పై వరుసగా ప్రతికూల నిర్ణయాలు
●ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న హామీలు ఏమయ్యాయంటున్న ఉద్యోగ సంఘాలు
●సెయిల్‌లో విలీనం చేయడమే పరిష్కారమని డిమాండ్
సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు భద్రతా కవచంగా ఉన్న సీఐఎస్‌ఎఫ్ కూడా ఇక ఉండదా..? వేల ఎకరాల్లో విస్తరించి.. వేల కోట్ల విలువైన ఆస్తులు, అత్యంత కీలకమైన ఉత్పత్తి విభాగాలున్న ప్లాంట్ నుంచి కేంద్ర బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతం..? ‘ప్రైవేటీకరణ చేయం’ అని చెబుతున్న కేంద్రం.. ఒక్కో అడుగు వేస్తూ చివరకు ప్లాంట్ భద్రతనూ తొలగిస్తోందా..? సీఐఎస్‌ఎఫ్ ఉపసంహరణే ప్రైవేటీకరణకు ముందడుగుగా మారుతోందా..? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లోని సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. నవంబర్ 17 నాటికి మొత్తం బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్లాంట్‌లో సుమారు 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఉపసంహరించనున్నారు. 2024 వరకు దాదాపు 1,500 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఉండగా.. రెండేళ్లుగా దశలవారీగా సంఖ్యను కుదిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మిగిలిన బలగాలనూ పూర్తిగా తొలగించేందుకు నిర్ణయించడం ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.
కూటమి వచ్చాక.. ఒక్కో అడుగు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్లాంట్ పరిస్థితులు మరింత దిగజారాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్ణయాలపై గట్టిగా నిలదీయడం లేదని విమర్శిస్తున్నాయి. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని ప్రైవేటు స్టీల్ పరిశ్రమకు గనుల కేటాయింపు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిందని ఆరోపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకున్నామని.. అప్పట్లో కేంద్ర ఉక్కు మంత్రి సైతం ఈ విషయాన్ని ప్రకటించారని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి.
ముడిసరుకు కొరత.. ఉద్యోగుల కుదింపు
2024 సెప్టెంబర్‌లో వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కొరత తీవ్రరూపం దాల్చింది. కోకింగ్ కోల్ అందక బ్లాస్ట్ ఫర్నేస్–3 మూతపడటంతో ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 25 శాతానికి పడిపోయి నష్టాలు మరింత పెరిగాయి. 2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఉత్పత్తి తగ్గిందన్న కారణంతో కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా వీఆర్‌ఎస్ అమలు చేశారు. సుమారు 12,300 మంది ఉన్న శాశ్వత ఉద్యోగులను 2026 డిసెంబర్ నాటికి 8 వేలకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. మరోవైపు వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2025 జనవరిలో కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. అందులో ఎక్కువ మొత్తం పాత బకాయిలు, రుణాల చెల్లింపులకే వెళ్లిందని.. ప్లాంట్ అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
కీలక విభాగాలు ప్రైవేటు బాటలో..
2025 ఆగస్టులో ప్లాంట్‌లోని 44 కీలక విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం టెండర్లు పిలిచింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోక్ ఒవెన్, సింటర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ వంటి కీలక విభాగాలు ఇందులో ఉండటంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే ఏడాది ఉద్యోగులపై సీఎం చంద్రబాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్స్’ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పని చేయని ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్న ఆయన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
భద్రతా కవచానికీ కోత
నిర్వహణ వ్యయాన్ని తగ్గించే చర్యలతో ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు దెబ్బతిన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2025 డిసెంబర్‌లో ఫ్యాక్టరీల శాఖ తనిఖీల్లో 645 భద్రతా లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చిందని చెబుతున్నాయి. 2026 జనవరిలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తగ్గింపు ప్రక్రియ మొదలైంది. సెక్యూరిటీ, ఫైర్ విభాగాల నుంచి సుమారు 400 మందిని తగ్గించి.. వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు. తాజాగా మిగిలిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బందినీ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో అనుభవజ్ఞులైన కాంట్రాక్టు సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందితో కీలక విభాగాల్లో పనులు చేయించారని సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 జూన్ 8న ఎస్‌ఎంఎస్–2 విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.
రూ.8,097 కోట్ల సాయం ఎక్కడ?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంట్‌కు అదనంగా రూ.8,097 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 2026 మేలో సిఫార్సు చేసినా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తగిన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని విమర్శిస్తున్నాయి. ఇక 2026 జూలైలో రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన స్టీల్ కొనుగోళ్లలో విశాఖ ఉక్కుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలుకు సీఆర్‌డీఏ అనుమతులు ఇచ్చిందని ఆరోపిస్తున్నాయి. ఆ ఆర్డర్‌ను స్టీల్‌ప్లాంట్‌కు ఇచ్చి ఉంటే కొంత ఆర్థిక ఊరట లభించేదని పేర్కొంటున్నాయి.
జింక్ పరిశ్రమలోనూ ఇదే దారి
విశాఖలోని హిందూస్థాన్ జింక్ పరిశ్రమ పరిణామాలను ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాయి. తొలుత ముడిసరుకు రవాణా భారం పెరగడం.. నష్టాలు రావడం.. ఆ తర్వాత సీఐఎస్‌ఎఫ్ భద్రతను ఉపసంహరించడం.. అనంతరం ప్రైవేటీకరణ.. చివరకు ముడిసరుకు వ్యయం భారంగా మారడంతో 2012లో పరిశ్రమ శాశ్వతంగా మూతపడిందని చెబుతున్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కులోనూ ముడిసరుకు కొరత, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల సంఖ్య కుదింపు, కీలక విభాగాల ప్రైవేటీకరణ, భద్రతా బలగాల ఉపసంహరణ వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జింక్ పరిశ్రమ బాటలోనే స్టీల్‌ప్లాంట్‌నూ నడిపిస్తున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.


