అరకొర కిట్లు.. నాణ్యత లేమి.! | - | Sakshi
Sakshi News home page

అరకొర కిట్లు.. నాణ్యత లేమి.!

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్‌ హయాంలో విద్యా వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. విద్యార్థులకు అందించే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి కిట్లు’ మొదలుకొని మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ‘నాడు–నేడు’ నిర్మాణ పనుల వరకు అన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. చివరకు ఉపాధ్యాయుల హ్యాండ్‌బుక్స్‌, డస్టర్లు, సుద్దముక్కలు కూడా సరఫరా చేయలేని స్థితికి దిగజారింది. పాఠశాలలు ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా జిల్లాలోని 24 మండలాల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి కిట్లు పూర్తిస్థాయిలో అందలేదు. అరకొరగా ఇచ్చిన బూట్లు, బ్యాగులు కూడా నాణ్యత లేకుండా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అరకొరగానే పాఠ్య పుస్తకాల సరఫరా

జిల్లా వ్యాప్తంగా మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు కూడా అరకొరగానే అందాయి. ఇంకా అనేక పాఠశాలలకు మండల కేంద్రాల నుంచి పుస్తకాలు చేరాల్సి ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్న కొన్ని పుస్తకాలను తీసుకెళ్లడానికి కూడా సరైన బ్యాగులు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. గతేడాది సరఫరా చేసిన బ్యాగులు కూడా నాణ్యత లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నోట్‌ పుస్తకాలు, బెల్టులు, సాక్స్‌, షూస్‌ల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు.

చిరిగిన బ్యాగులు, తెగిన బూట్లతో నెట్టుకొస్తున్న విద్యార్థులు

స్కూల్స్‌ తెరిచి 40 రోజులైనా కొత్త వారికి అందని పుస్తకాలు

గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన రోజే పంపిణీ

కొత్త విద్యార్థులు కిట్ల కోసం ఎదురుచూపులు

మంత్రి లోకేష్‌ హయాంలో విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం.!

కొత్త విద్యార్థులకు ఎప్పుడిస్తారో.!

విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 8 వేల మంది విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్‌) పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులకు బూట్లు, బ్యాగులు అందని పరిస్థితి నెలకొనగా.. కొత్తగా చేరిన ఈ 8 వేల మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యా కిట్లు ఎప్పుడు అందుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత విద్యార్థులకే అవసరమైన సామగ్రిని నెల రోజులు గడిచినా పూర్తిగా పంపిణీ చేయలేకపోయిన ప్రభుత్వం, పెరిగిన విద్యార్థుల అవసరాలను ఎలా తీర్చనుందో స్పష్టత లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం బయట మార్కెట్లో కొన్న బ్యాగులతో కొందరు విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. మరికొందరు పాత వాటికే కుట్లు వేసుకుని నెట్టుకొస్తున్నారు.

పాత బ్యాగులకే మళ్లీ మళ్లీ కుట్లు..

కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి కిట్లు పంపిణీ చేయకపోవడం.. గతేడాది నుంచి కొనసాగుతున్న విద్యార్థులకు ఇంకా కిట్లు ఇవ్వకపోవడంతో వారు పాత బ్యాగులు, చిరిగిన బూట్లకు కుట్లు వేయించుకుని పాఠశాలలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం విద్యా సంస్కరణల గురించి ఎంత ప్రచారం చేసుకుంటున్నా, కనీస విద్యా సామగ్రిని కూడా సమయానికి అందించలేకపోవడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో తొలి రోజే పంపిణీ

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ‘జగనన్న విద్యా కానుక’పేరుతో నాణ్యమైన నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, మూడు జతల యూనిఫాం, బెల్ట్‌, సాక్స్‌, వర్క్‌ బుక్స్‌తో కూడిన కిట్‌ను పాఠశాలలు తెరిచిన మొదటి రోజే పంపిణీ చేసేవారు. పక్కా ప్రణాళికతో ముందస్తుగానే సామగ్రిని సిద్ధం చేసే సంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం కిట్ల పంపిణీ జాడే లేకపోవడం, ఇచ్చిన కొన్నింటిలో నాణ్యత లోపించడం పరిపాటిగా మారింది.

జిల్లాలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement