వరుణ దేవా.. కరుణించవా.! | - | Sakshi
Sakshi News home page

వరుణ దేవా.. కరుణించవా.!

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

వెన్నలపాలెం మహిళల ఆలయప్రదక్షిణలు, పూజలు

సాయంత్రం చిరుజల్లులు పడడంతో సర్వత్రా హర్షం

నాతవరం: వరుణ దేవుడు కరుణ కోసం మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెం గ్రామంలోని మహిళలు శనివారం ఆలయ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు నిర్వహించిన ఈ పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా తాండవ జంక్షన్‌లోని వినాయకుడి ఆలయాన్ని బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి శుద్ధి చేశారు. అనంతరం గ్రామంలోని సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, జీడితోటల్లో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని కూడా నీటితో శుభ్రపరిచి, ఆలయాల చుట్టూ నీటి బిందెలతో ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చిన నీటితో శుభ్రం చేసి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఎండ తీవ్రత తగ్గించి సకాలంలో వర్షాలు కురిపించాలి’అంటూ మహిళలు దేవుడిని ప్రార్థించారు. అనంతరం గ్రామ వీధుల్లో బిందెల్లో నీళ్లు తీసుకుని ఊరేగింపుగా తిరుగుతూ ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ సందడి చేశారు. ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతూ సాయంత్రానికి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ పూజల ఫలితంగా వర్షం కురిసిందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్వకాలంలో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఇదే విధంగా ఆలయాలను శుభ్రపరిచి, పూజలు నిర్వహించే సంప్రదాయం ఉందని గ్రామ పెద్దలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement