పోలవరం గట్లపై
హోంమంత్రి ఇలాకాలో యథేచ్ఛగా గ్రావెల్ దోపిడీ
● తుని, పాయకరావుపేట సరిహద్దుల్లో అక్రమ తవ్వకాలు
● టీడీపీ నాయకుల అండదండలు
● కాలువ గట్లను తవ్వి లేఅవుట్లకు తరలింపు
● నెలకు రూ.3 నుంచి 5 కోట్లు ఆర్జన
నక్కపల్లి: పాయకరావుపేట, తుని సరిహద్దులో ఉన్న తాండవ చక్కెర కర్మాగారం వద్ద నిర్మాణంలో ఉన్న కాలువ గట్లను రాత్రి సమయంలో తవ్వేసి నక్కపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తరలిస్తున్న మూడు టిప్పర్లను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. మరో ఏడు లారీలను అక్రమార్కులు వెనక్కి తిప్పి టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డుపక్కన ఆన్‌లోడ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 6,7,8 ప్యాకేజీల కింద పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు జరుగుతున్నాయి. కాలువ తవ్వకాల్లో వచ్చిన మట్టి, గ్రావెల్‌ను కాంట్రాక్టర్లు గట్లుగా వేశారు. భూమట్టం నుంచి సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తున లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను గట్లుగా వేశారు. ఇలా వేయడం వల్ల కాలువను ఆనుకుని ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవకుండా రక్షణ కల్పిస్తాయి. ఈ గట్లపై టీడీపీ నాయకుల కళ్లు పడ్డాయి. తుని నియోజకవర్గానికికి చెందిన ఒక టీడీపీ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కూటమి నాయకులు కలిసి ఈ పోలవరం కాలువ గట్లను ప్రైవేటు లేఅవుట్లకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.లక్షల్లో బేరం కుదుర్చుకున్న ఈ నేతలిద్దరూ ప్రభుత్వ పెద్దలకు తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మామూళ్లు ముట్టజెప్పి ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. ఇలా తవ్వేసిన మట్టిని లేఅవుట్లకు తరలించేస్తున్నారు. పొక్లెయిన్‌ల సాయంతో తవ్వేసిన మట్టిని వందలాది టిప్పర్లతో తరలిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్ద పోలీసులు మూడు టిప్పర్లను పట్టుకున్నారు. పోలీసులు ఉన్నారన్న విషయం తెలుసుకున్న అక్రమార్కులు వెనుక వస్తున్న లారీలను ఆపేసి జాతీయ రహదారి పక్కన ఆగమేఘాల మీద అన్‌లోడ్ చేశారు.
నకిలీ బిల్లులతో తరలింపు..?
పోలీసులు పట్టుకున్న లారీల వద్ద ఏఎంఆర్ వారు ఇచ్చిన బిల్లులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పోలవరం కాలువ గట్లపై మట్టిని లేదా చెరువుల్లో మట్టిని తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల అనుమతి కావాలి. ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించిన తర్వాతే అనుమతి పొంది తవ్వకాలు మొదలు పెట్టాలి. అయితే ఇటీవల ప్రభుత్వం నియమించిన ఏఎంఆర్ సంస్థ కేవలం అనధికారికంగా రవాణా జరుగుతున్న ఇసుక, మట్టి, గ్రావల్‌ను తనిఖీలు నిర్వహించి సెస్సు ఫీజు మాత్రమే వసూలు చేయాలి. కానీ ఈ లారీల్లో పోలవరం కాలువ మట్టి, ఇతర ప్రాంతాల నుంచి గ్రావెల్ తరలిస్తుంటే ఏఎంఆర్ వారు బిల్లులు, అనుమతులు ఎలా ఇస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పోలీసులు పట్టుకోకుండా నకిలీ బిల్లుల సాయంతో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిప్పర్ గ్రావెల్‌ను రూ.4 వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు.
బిల్లులు పరిశీలనకుపంపాం : సీఐ మురళి
ఈ విషయమై సీఐ మురళి వద్ద ప్రస్తావించగా తమకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి టోల్ ప్లాజా వద్ద ఏపి39యువై3683 (36టన్నులు) ఏపి39విబి1266 (37టన్నులు), 39డబ్ల్యుబి1265/(37టన్నుల) గ్రావెల్ తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. వీటిని తుని నుంచి నక్కపల్లి తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. డ్రైవర్ల వద్ద ఏఎంఆర్ బిల్లులు ఉన్నాయన్నారు. ఇవి నకిలీవా, అసలువా అనేది నిర్ధారించడం కోసం మైనింగ్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. వాటి చెల్లుబాటు, సామర్ధ్యం, అనుమతించిన పరిమా ణం తదితర అంశాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్టు నిర్ధారణ అయితే వాహనాలు, డ్రైవర్లు, యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
రోజూ రూ.10 లక్షల విలువైన మట్టి తరలింపు
ఇలా ఉండగా ముకుందరాజుపేట, రమణయ్యపేట, గుల్లిపాడు పరిసర ప్రాంతాల్లో మెరక గ్రామాలకు చెందిన ఒక టీడీపీ నాయకుడి సాయంతో పోలవరం కాలువ నుంచి 8 వేల ట్రిప్పుల గ్రావెల్‌ను గుల్లిపాడు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం ఎత్తు చేసేందుకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. పోలవరం కాలువ నుంచి ప్రతిరోజు సుమారు రూ.10 లక్షల విలువైన గ్రావల్, మట్టి తరలించుకుపోతున్నారు. ఇలా నెలకు రూ.3 నుంచి రూ.5 కోట్లుపైనే ఆర్జిస్తున్నారు. హోంమంత్రి నియోజకవర్గంలో ఇలా వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అండదండలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు అధికారులను బెదిరించి పోలవరం కాలువ గట్లను దోచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


