మాడుగుల: మండలంలో అత్యంత జలవనరులు గల పెద్దేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. జలాశయం ఎడమ కాలువ రాచకట్టు చానల్ పరిధిలో ఆయకట్టు 4,600 ఎకరాలు కాగా ప్రస్తుతం 1000 ఎకరాల్లో మాత్రమే దమ్ములు పూర్తయ్యాయి. కానీ అవి కూడా సాగు నీరందక ఎండిపోయి బీటలు వారుతున్నాయని అన్నదాతలు బోరుమంటున్నారు. జలాశయం కేచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురవక పోవడంతో ఇన్‌ఫ్లో 9 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 130.55 మీటర్లకు తగ్గిపోయింది. రాచకట్టుకు 25 క్యూసెక్కులు, ఆర్‌ఎంసీ కెనాల్‌కు 25 క్యూసెక్కులు రెండు కాలువలు ద్వారా రోజుకు 50 క్యూసెక్కులు సాగు నీరు 10 రోజులుగా విడుదల చేస్తున్నారు. కానీ శివారు ఆయకట్టు భూములకు సాగు నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ఇంతవరకు వరి నారుమడులు బిందెలతో తడిపి కాపాడారు. నారు ముదిరిపోవడంతో ఇకపై నాట్లు వేసినా దిగుబడులు రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.


