అవయవదానంతో అమరుడైన శ్రీదత్తు | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో అమరుడైన శ్రీదత్తు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

తుమ్మపాల : పేద కుటుంబంలో జన్మించి నిరంతరం శ్రమిస్తూ కుటుంబానికి అండగా నిలిచిన ఓ యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడిన బాధను దిగమింగుతూనే తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు రావడం, బౌతికంగా కుమారడు లేకపోయినా అవయవాలతో మరోకరికి జీవితాన్నిచ్చేలా వేసిన అడుగు అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆ పేద కుటుంబం సమాజం పట్ల తీసుకున్న నిర్ణయంతో శ్రీదత్తు అంతిమయాత్రకు విశేష పలువురి ప్రశంసలు అందుకుంది.వివరాలివి.

అనకాపల్లి గవరపాలేనికి చెందిన పెంటకోట శివ సూర్యనారాయణ, మాణిక్యంలకు ద్వితీయ కుమారుడు పెంటకోట శ్రీదత్తు (యువకుడు) టైల్స్‌ మేస్త్రిగా పనిచేస్తూ ఈ నెల 13న పరవాడకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కిమ్స్‌కు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అధిక రక్తపోటు కారణంగా మెదడులోని ఎడమ భాగంలోని రక్తనాళాలు దెబ్బతిన్నాయని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. రెండు రోజులపాటు వైద్యులు తీవ్రంగా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదత్తు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విషాదంలోనూ గొప్ప నిర్ణయం...

కుమారుడు లేడని వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అవయవదానంపై అవగాహనతో తీవ్ర బాధలోనూ మరొకరికై న తమ కుమారుడి ద్వారా జీవం అందించాలనే గొప్ప ఆలోచన చేశారు. అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు పెంటకోట మాణిక్యం, శివ సూర్యనారాయణ, అన్నయ్య భాస్కర్‌ కుమార్‌ అనుమతించడంతో ఈ నెల 16న వైద్యుల సమక్షంలో అవయవదానం ప్రక్రియ మొదలుపెట్టి అధికారుల ధ్రువీకరణతో అవయవాల సేకరణ పూర్తి చేసి మంగళవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

కన్నీటి వీడ్కోలు

శ్రీదత్తు భౌతికకాయాన్ని స్వస్ధలమైన అనకాపల్లి గవరపాలేనికి మొదటిగా తీసుకొచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శన నిమిత్తం భారీగా తరలివచ్చిన జనంతో సుంకరమెట్ట కూడళి నుంచి నుంచి దాసరి గెడ్డ రోడ్డు, పార్క్‌ సెంటర్‌, శతకంపట్టు, శ్రీసంతోషిమాత ఆలయం మీదుగా బాలకృష్ణ బస్‌స్టాప్‌, శంకరం, రేబాక, గొలగాంలోని ప్రస్తుత నివాసముంటున్న చోట వరకు ఊరేగింపుగా తీసుకెళ్లడంతో కుటుంబసభ్యులు రోధనలు మిన్నంటాయి. అక్కడ నుంచి శ్మశానవాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారం పూర్తి చేశారు. శ్మశానవాటిక వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, స్థానికులు శ్రీదత్తు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వారం రోజులుగా హైబీపీ..

శ్రీదత్తు అందరితో ఆప్యాయంగా, సరదాగా ఉండే వ్యక్తిగా కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తు చేసుకున్నారు. నిరంతరం కష్టపడి పనిచేసే శ్రమజీవి. అయితే మరణానికి ముందు వారం రోజులుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నప్పటికీ పని ముఖ్యమంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు అదే తీవ్ర పరిణామాలకు దారితీసి ప్రాణాలను బలిగొంది.

యువతకు ఓ హెచ్చరిక....

ఇటీవలి కాలంలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోయినా యువతలో ఆకస్మిక మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీదత్తు ఘటన కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో తెలియజేస్తోంది. యువత పని, సంపాదన అని కాకుండా తమ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఆకస్మిక మరణం..అవయవదానంతో మరో జన్మ

కొడుకును కోల్పోయిన విషాదంలోనూ అవయవదానానికి కుటుంబం నిర్ణయం

భారీ బైక్‌ ర్యాలీతో అంతిమయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement