● ధారకొండ దిగువన నాట్లు
● తీవ్ర వర్షాభావంలోనూ సాగుకు నీళ్లు
గొలుగొండ : ధారకొండ అండ అంటే ఈ ప్రాంత రైతులకు కొండంత అండ. ఏనాడు నాట్లు వేయలేని దుస్ధితి ఉండదు., తీవ్ర వర్షాభావ పరిస్ధితులు వచ్చినా ఏనాడా రైతులు నాట్లు వేయకుండా ఉండరు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడినప్పుటికి నాట్లు వేయడం కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఈ ప్రాంతంలో నాట్లు వేయకుండా ఉండలేరు. ధారమఠం శివాలయం ఆనుకొని ఉన్న ధారకొండ నుంచి వచ్చే సాగునీరు ఈ ప్రాంతంలో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ధారకొండ నుంచి ధారగా...
మహాపర్వతం ధారకొండ నుంచి వచ్చి సాగునీరు గొలుగొండ మండలంలో కొత్తపాలెం, ధారగెడ్డ, పాతమల్లంపేట, పరిసర ప్రాంతాల్లో ఉన్నత 700 ఎకరాల సాగు భూములకు ఎంతో అండగా నిలుస్తోంది. ఈ కొండపై వర్షం కురిస్తే సాలు ఈ ప్రాంతం అంతా సస్య శ్యామలమే. కానీ ఈ ఏడాది కనీవిని ఎరగని రీతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఇక్కడి కొండపై ఏ మాత్రం వర్షం కురిసినా ధారగెడ్డ పొంగి ప్రవహించడం జరుగుతుంది. వర్షం లేకపోయినా ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న సాగునీరు ఆధారంగా సుమారుగా ఇప్పటికే 400 ఎకరాల్లో నాట్లు వేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో సాగునీరు సరిపోలేదని రైతులు సరుగుడు, ఇతర వ్యవసాయాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉన్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని వరి సాగు చేయడం జరుగుతుంది.
తాండవ జలాశయానికి కష్టమే
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిపెద్ద జలాశయంగా పేరున్న తాండవ జలాశయానికి ఈ ఏడాడి సాగు నీరు అందడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రైతులు నాట్లు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాండవ జలాశయానికి ప్రదాన ఆధారం గొలుగొండ మండలంలో ఉన్న ధారగెడ్డ, బోరింగ్‌గెడ్డ, బొడ్డేరు గెడ్డలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఈ గెడ్డల నుండి చుక్కనీరు ప్రవహించడం లేదు. ఇప్పటికే తాండవ జలాశయం నీటిని విడుదల చేయడం జరిగింది. తాండవ జలాశయానికి ఆధారమైన పై గెడ్డల నుంచి చుక్క నీరు తాండవకు చేరడం లేదు. వర్షాలు కురిస్తే తప్ప తాండవ జలాశయానికి నీరు చేరదు. దారకొండ దిగువన ఉన్న ప్రాంతంలో ఉన్న పంట భూములకు మాత్రం ప్రస్తుతం ప్రవహిస్తున్న సాగునీరు వల్ల నాట్లు జరుగుతున్నాయి. ఈ కొండే తమకు అండ అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


