మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి రెవెన్యూలో సర్వేను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 737లో 1600 ఎకరాల భూమిలో ఇప్పటికే 406 ఎకరాలను ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల నుంచి మిగిలి ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ భూమికి సంబంధించి రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య సరిహద్దుల నిర్ధారణపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ చేపట్టిన సర్వే ఫారెస్ట్‌కు చెందిన భూముల్లో ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సోమవారం కోటవురట్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి వివేకానంద తన సిబ్బందితో కలసి పరిశీలించారు. ప్రస్తుత సర్వే అనకాపల్లి రేంజ్ పరిధిలో జరుగుతుందని నిర్ధారించుకున్నారు. నర్సీపట్నం రేంజ్ పరిధి కాకపోవడంతో ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా 30 ఏళ్లకుపైగా ఈ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. పరిశ్రమలకు తమ సాగు భూమిని సేకరిస్తే ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


