మద్దిలపాలెం: జీఎంఆర్ సంస్థ లాభాల కోసం సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను శాశ్వతంగా మూసివేసి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం సీనియర్ నాయకుడు సీహెచ్ నర్సింగరావు ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ మూసివేతను వ్యతిరేకిస్తూ సీపీఎం ఇచ్చిన బ్లాక్‌డే పిలుపులో భాగంగా ఆదివారం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ విమానాశ్రయంగా కొనసాగిస్తూ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ విమానాశ్రయం ద్వారా ఏటా 45 లక్షల మందికి పైగా ప్రయాణ సేవలు పొందుతున్నారని, అలాంటి విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ బి.గంగారావు, ఆర్‌కేఎస్‌వీ కుమార్ మాట్లాడుతూ జీఎంఆర్‌కు లబ్ధి చేకూర్చేందుకే విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నారని విమర్శించారు. విశాఖ అభివృద్ధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వ్యయంపై అనుమానాలున్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. రూ.1500 కోట్లు కూడా ఖర్చుకాని భోగాపురం విమానాశ్రయానికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.మణి, వి.కృష్ణారావు, కె.ఎం.శ్రీనివాస్, ఎం.సుబ్బారావు, వెంకటరావు, నరేంద్రకుమార్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుడు సీహెచ్ నర్సింగరావు


