బినామీల కోసం.. రైతన్నలకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

బినామీల కోసం.. రైతన్నలకు వెన్నుపోటు

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

బినామీల కోసం.. రైతన్నలకు వెన్నుపోటు

బినామీల కోసమే చక్కెర కర్మాగారాలు బలి చేసేందుకు కుయుక్తులు

సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా రైతాంగానికి జీవనాధారంగా ఉన్న సహకార చక్కెర కర్మాగారాలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలతో చెరకు సాగు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంటే.. మరోవైపు ప్రభుత్వం వాటిని ఆదుకోవాల్సింది పోయి.. ఫ్యాక్టరీల భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టి బినామీలకు దోచిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతోందని వై ఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కర్మాగారాల్లో వేలాది మంది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్నారని, వారి ఆస్తులపై పెత్తనం చేసి విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించి, లిక్విడేషన్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సెప్టెంబర్‌ 20 తర్వాత రైతాంగాన్ని ఏకం చేసి మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

అనకాపల్లి జిల్లాలో ఒకప్పుడు 30 వేల హెక్టార్లలో సాగైన చెరకు, ఇప్పుడు కేవలం 3,000 హెక్టార్ల దిగువకు పడిపోయింది. ఎకరాకు రూ. 80 వేల వరకు పెట్టుబడి పెడుతుంటే, కనీసం గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. మూతపడిన ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల ఫ్యాక్టరీలను తెరిపించడానికి నిధులు వెచ్చించి, ఆధునికీకరించాల్సిన కూటమి ప్రభుత్వం, ఆ బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న ఏకై క సహకార కర్మాగారం ‘గోవాడ’ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 24 వేల మంది రైతులు, కార్మికులకు సంబంధించిన రూ. 35 కోట్ల బకాయిలను రెండేళ్లుగా చెల్లించలేదు. కోఆపరేటివ్‌ నిబంధనలకు విరుద్ధంగా వాటిని లిక్విడేషన్‌ చేసి, భూములను ఏపీఐఐసీ ద్వారా కారుచౌకగా తమ అనుయాయులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

భూములపై కన్నేసిన చంద్రబాబు సర్కార్‌.!

సుగర్‌ ఫ్యాక్టరీ రైతుల్ని ఆదుకోకపోవడానికి కారణం.. వాటి పరిధిలో ఉన్న విలువైన భూములే. ఆ భూముల్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. అందుకే.. ఫ్యాక్టరీలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. దీని వెనుక భూముల్ని తమ అనుయాయులకు కట్టబెట్టే మాస్టర్‌ప్లాన్‌ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికే నలుగురు మంత్రులతో నామమాత్రంగా కమిటీ వేశారని విమర్శలొస్తున్నాయి.

రైతుల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమేంటి.?

ఫ్యాక్టరీల భూములు ప్రభుత్వం ఇచ్చినవి కావు. ఉదాహరణకు, 1954లో దేశంలోనే తొలి కోఆపరేటివ్‌ ఫ్యాక్టరీగా ఏర్పడిన ఏటికొప్పాక ఫ్యాక్టరీలో 5,400 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతుల షేర్‌ క్యాపిటల్‌, ఫ్యాక్టరీ లాభాలతోనే సుమారు 120 ఎకరాల భూములు, ఆస్తులు సమకూరాయి. అటువంటిది రైతులతో కనీసం సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం లేదు. షేర్‌ హోల్డర్స్‌గా ఉన్న రైతుల సమ్మతి లేకుండా ఏకపక్షంగా ఆస్తులను ఏపీఐఐసీకి బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.

రైతుల్ని ఆదుకున్న తండ్రీకొడుకులు

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చెరకు రైతులు, సహకార చక్కెర కర్మాగారాలకు స్వర్ణయుగమనే చెప్పాలి. ఒకవైపు వైఎస్సార్‌ తన పాలనలో చెరకు రైతులకు టన్నుకు రూ. 200 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకం అందించి, చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో నడిచేలా రైతులకు కొండంత అండగా నిలిచారు. తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా సంక్షోభంలో ఉన్న సహకార రంగానికి ఊపిరిపోసింది. మూతపడే స్థితికి చేరుకున్న చోడవరం (గోవాడ) వంటి కోఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీల్ని కాపాడేందుకు ఏకంగా రూ. 90 కోట్ల వరకు ప్రభుత్వ నిధులను గ్రాంట్‌గా మంజూరు చేసి ఆదుకుంది. అంతేకాకుండా, ఏటికొప్పాక, తాండవ కర్మాగారాల్లోనూ విజయవంతంగా క్రషింగ్‌ జరిగేలా చూడటమే కాకుండా, ప్రతీ ఏటా క్రమం తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో రైతుల పాత్రను, వారి హక్కులను గౌరవించిన ఘనత ఈ తండ్రీకొడుకులకే దక్కుతుంది.

సెప్టెంబర్‌ 20 ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ :వైఎస్సార్‌సీపీ

ఏపీఐఐసీకి ఆస్తుల బదలాయింపు పేరుతో తీసుకొచ్చిన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్‌ చేసింది. ఫ్యాక్టరీ భూములను విక్రయించడం మానుకుని, ప్రత్యామ్నాయ పంటలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని సూచించింది. సెప్టెంబర్‌ 20లోగా గోవాడ రైతులకు రూ. 35 కోట్ల బకాయిలు చెల్లించాలనీ.. వెంటనే జనరల్‌ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫ్యాక్టరీల భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, సెప్టెంబర్‌ 20 తర్వాత వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున సొంతంగా సర్వసభ్య సమావేశం నిర్వహించి.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలోని పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పార్టీ రీజనల్‌ కోర్డినేటర్‌ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌, అనకాపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మలసాల భరత్‌, నియోజకవర్గ పరిశీలకులు గండి రవి, వీసం రామకృష్ణ, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఐఐసీ ద్వారా ఆస్తులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు

గోవాడ రైతులకు అందని బకాయిలు.. జీతాల్లేక కార్మికుల అవస్థలు

రైతుల తరఫున పోరాటాలకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ

కుట్రలు ఆపాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం

సెప్టెంబర్‌ 20 లోపు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్‌

లేదంటే రైతులతో సమావేశమై

మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement