న్యాయం కోసం మెడికోల సమర దీక్ష | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం మెడికోల సమర దీక్ష

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

మూడో రోజూ ఉధృతంగా జూనియర్‌ డాక్టర్ల నిరసన

‘హైక్‌’ ఆకారంలో మానవహారం, ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ

ఓపీలు, వార్డుల్లో రోగుల అవస్థలు

మహారాణిపేట (విశాఖ) : జూనియర్‌ వైద్యుల నిరవధిక సమ్మె మూడో రోజూ కొనసాగింది. స్టైఫండ్‌ పెంపు, పెండింగ్‌ బకాయిల చెల్లింపు, వైద్య విద్యార్థులు, జూనియర్‌ వైద్యుల భద్రత, మెరుగైన పని వాతావరణం తదితర డిమాండ్లతో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కేజీహెచ్‌ ప్రాంగణాల్లో గురువారం నిరసనలు చేపట్టారు. తొమ్మిది మంది పీజీ వైద్యులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. మిగిలిన జూనియర్‌ వైద్యులు, మెడికోలు ‘హైక్‌’ ఆకారంలో మానవహారం నిర్వహించి, ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. జూనియర్‌ వైద్యులు సమ్మెలో ఉండటంతో కేజీహెచ్‌తోపాటు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీలు, వార్డులు, శస్త్రచికిత్సలపై ప్రభావం పడింది. కేజీహెచ్‌లో సుమారు 26 ఓపీల్లో జూనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రోగులు ఓపీల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని శస్త్రచికిత్సలు కూడా వాయిదా పడ్డాయి. కేజీహెచ్‌లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీలు, 500 మంది జూనియర్‌ వైద్యులు, ఇతర వైద్య విద్యార్థులు వైద్య సేవల్లో పాల్గొంటుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో మూడు షిఫ్టుల్లో రోగుల పర్యవేక్షణపై ప్రభావం పడింది. గైనిక్‌ ఓపీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు రోగులకు సేవలందించారు. కాగా స్టైఫండ్‌ సవరణతోపాటు పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని జూనియర్‌ వైద్యులు డిమాండ్‌ చేశారు. వైద్య విద్యార్థులు, ఇంటర్న్‌లు, పీజీలకు భద్రత, రాత్రివేళల్లో రక్షణ, పని ఒత్తిడి తగ్గింపు, మెరుగైన హాస్టల్‌ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా నిరసన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement